వడ్డించేవాడు మనవాడు అయితే కడ పంక్తిలో కూర్చున్నా కడుపునిండా భోజనం దొరుకుతుంది అంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది అదే. 2000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని.. నామమాత్రపు అద్దెతో 99 సంవత్సరాల లీజుకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వేలకోట్ల విలువచేసే ఈ భూమి కేటాయింపుల వెనుక అనేక అవకతవకలు ఉన్నాయన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ.
విశాఖ నగరంలోని బీచ్ రోడ్ లో 13 ఎకరాల భూమిని లు గ్రూప్ కంపెనీలకు లీజుకి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఎకరం భూమి వందల కోట్ల విలువ చేసేది. ఈ 13 ఎకరాల భూమి విలువ అక్షరాల 2000 కోట్లు అని తెలుస్తోంది. ఒక్కో ఎకరాకు ఏడాదికి 50 లక్షల లీజుకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఏడాదికి ఆరు కోట్ల రూపాయలు సదరు కంపెనీ చెల్లిస్తుంది అన్నమాట.
ఆరు కోట్ల రూపాయల కోసం రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులను కట్టబెట్టడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ లీజు వెనుక కనీస నిబంధనలు పాటించలేదన్న విమర్శ ఉంది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భూ కేటాయింపులను విమర్శించింది కూటమి. అప్పట్లో నిబంధనలు పారదర్శకంగా అమలు చేసి భూములను ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. దానిని తప్పు పట్టిన కూటమి.. ఇప్పుడు చేస్తుంది ఏమిటి అని నిలదీతలు ఎదురవుతున్నాయి.
వాణిజ్య సంస్థల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఒకటి ప్రభుత్వానికి ఆదాయం.. రెండు ఉద్యోగం ఉపాధి అవకాశాలు. కానీ విశాఖకు లులు కంపెనీ వస్తే.. ప్రభుత్వానికి ఏడాదికి ఆదాయం 6 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 2000 కోట్ల విలువ చేసే భూములను లీజుకు ఇవ్వడం ద్వారా.. కేవలం ఏడాదికి 6 కోట్లు ఇవ్వడం అంటే ఆదాయం ఎలా అవుతుంది? పైగా ఆ కంపెనీ రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయా అన్నది కూడా ఒక అనుమానమే.
విశాఖ నగరంలో ఓ ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించడం అంటే చిన్న విషయం కాదు. దీని వెనుక భారీగా అక్రమాలు జరిగాయి అన్నది ఆరోపణ. దీనిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది. లేకుంటే మాత్రం ప్రభుత్వం పై మచ్చ ఖాయం.