ఏపీ బీజేపీ చీఫ్ ఎవరు? వెనుకబడిన వర్గాలకు ఇస్తారా? కాపులకు కేటాయిస్తారా? లేకుంటే మరోసారి కమ్మలకు కొనసాగింపు ఉంటుందా? రాయలసీమ రెడ్డి లకు దక్కుతుందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఈసారి బిజెపి హై కమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఓ ఇద్దరు నేతల మధ్య బిజెపి చీఫ్ పోస్టుకు గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం.
రెండేళ్ల కిందట ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. అప్పట్లో అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకు కాని బిజెపికి ప్రాతినిధ్యం లేదు. శాసనమండలిలో కూడా ప్రాతినిధ్యం లేదు. ఇటువంటి తరుణంలో పురందేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె హయాంలో పార్టీ పటిష్టం కంటే.. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఎక్కువ ప్రయత్నాలు చేశారన్నది ఒక విమర్శ. మూడు పార్టీల పొత్తుతో బిజెపికి కలిసి వచ్చింది. బిజెపి ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే బిజెపి విజయం పురందేశ్వరి ఖాతాలో పడింది. అందుకే ఆమె ఏపీ బీజేపీ చీఫ్ గా కొనసాగింపు ఉంటుందని అంతా భావించారు. అయితే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఏపీ బీజేపీ చీఫ్ కొనసాగింపు కష్టమే. ఆమె స్థానంలో కొత్త వారిని ప్రకటిస్తారని కూడా తెగ ప్రచారం జరుగుతోంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే చివరిగా సీఎం రమేష్, సుజనా చౌదరి లో ఒకరికి పదవి ఖాయమని తేలిపోయింది.
అయితే ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడం విశేషం. మొన్నటి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కోసం ఈ ఇద్దరు నేతలు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. పొత్తు సక్సెస్ కావడం వెనుక కూడా వీరి పాత్ర ఉంది. అందుకే వీరిద్దరిలో ఒకరికి బిజెపి చీఫ్ పదవి ఇవ్వాలని చంద్రబాబు సైతం ప్రయత్నించే అవకాశం ఉంది.
సీఎం రమేష్ సొంత జిల్లా కడప. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే ఈసారి పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి పోటీ చేశారు. అక్కడ వెలమ సామాజిక వర్గం ఉండడమే ప్రధాన కారణం. అంచనాలకు తగ్గట్టు భారీ మెజారిటీతో గెలిచారు సీఎం రమేష్. టిడిపి వర్గాలకు సన్నిహిత నేత కావడంతో ఉత్తరాంధ్రలో సీఎం రమేష్ మాట చెల్లుబాటు అవుతోంది. ఆయనకు బిజెపి పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలోపేతం అవుతుందని అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం రమేష్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు తక్కుతుందని భావించి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ సమీకరణలో భాగంగా ఆయనకు చాన్స్ రాలేదు. అందుకే బిజెపి చీఫ్ పదవి ఇచ్చి ఆయనకు కొంత సంతృప్తి పరుస్తారని సమాచారం. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఈ పోటీలో సీఎం రమేష్ వైపు హై కమాండ్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.