జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేయాలి.. ఒంటరి చేయాలి.. ఆత్మస్థైర్యం పై దెబ్బ కొట్టాలి.. రెక్కలు విరిచేయాలి.. ఇది కూటమి ప్రభుత్వం ప్లాన్. ఇందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంది చంద్రబాబు సర్కార్. ముందుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కీలక నేతల భరతం పట్టాలి. ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేయాలి. అరెస్టులు జరగాలి. ఇలా ప్రత్యేక వ్యూహంతో ముందుకెల్తోంది కూటమి ప్రభుత్వం.
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి వంటి వారు ఎక్కువగా ఉంటారు. అయితే ఇందులో విజయసాయిరెడ్డి ఇప్పటికే అస్త్ర సన్యాసం చేశారు. కూటమి ఒత్తిడి తట్టుకోలేక రాజకీయాలను విడిచిపెట్టారు. వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ వెనుక కూటమి ప్రభుత్వ పాత్ర ఉందన్నది స్పష్టం.
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ సజ్జల రామకృష్ణారెడ్డి పై పడింది. ఆయనతో పాటు కుమారుడు భార్గవరెడ్డి ని సైతం అరెస్టు చేయాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగింది. ఆయనను విచారిస్తున్నారు కూడా. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత కామెంట్స్ పై ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. అయితే ఈ విచారణలో సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఆయన కుమారుడు భార్గవ రెడ్డి పేరును పోసాని కృష్ణమురళి బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నే తాను చదివానని.. ఆ కామెంట్స్ ను సజ్జల భార్గవ్ రెడ్డి వైరల్ చేశారని విచారణలో పోసాని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ తండ్రీ కుమారుల అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానై వ్యవహరించారు. ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా విభాగాన్ని చూసేవారు. ఎన్నికల ఫలితాల తరువాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆయన తీరుతోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని సొంత పార్టీ నేతలు ఆరోపించినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఆయన సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తండ్రి కుమారులను అరెస్టు చేయడం ద్వారా జగన్ ను దెబ్బతీయాలన్నదే ప్లాన్ గా సమాచారం. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.