వారంలో ఓ పెద్ద నేత అరెస్టు కాబోతున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై టిడిపి కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఆయనను అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యం పై దెబ్బ కొట్టాలని చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముందుగా వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేశారు. అటు తర్వాత సినీ రచయిత పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేతను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్నది కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న ఆరోపణ. మద్యం సరఫరాతో పాటు కమిషన్ల రూపంలో దాదాపు 60 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కూటమినేతలు. ఇప్పటికే అప్పటి ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. ఇటీవల ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రను ఆరా తీసింది కూటమి ప్రభుత్వం. ఏపీ సిఐడి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పాలంటూ వాసుదేవ రెడ్డి పై సిఐడి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిధున్ రెడ్డి. మిధున్ రెడ్డి అప్పటి మద్యం కంపెనీలతో డీల్ చేసుకున్నారని.. డిష్టలరీలతో పాటు మద్యం సరఫరా చేసే సంస్థలను బెదిరించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారని.. మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి జే కమిషన్ల రూపంలో భారీగా దోపిడీకి పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో పెద్దిరెడ్డి తండ్రి కొడుకుల పాత్ర అధికంగా ఉన్నట్లు సిఐడి గుర్తించినట్లు సమాచారం.
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వెళ్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అయినా సరే ధైర్యంగా ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అటు పెద్దిరెడ్డి, ఆయన తనయుడు సైతం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారు. అందుకే ఆ తండ్రి కొడుకులను అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అది జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఖాయం. మరి దీనిని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.