Wednesday, March 19, 2025

బొత్స సౌండ్ చేస్తే.. కూటమి సర్కారుకు ఇక్కట్లే!

- Advertisement -

ఉమ్మడి ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స సత్యనారాయణ. ఆయన పెద్దరికాన్ని గౌరవించి పెద్ద బాధ్యతలే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి పక్ష నేతగా పదవి ఇచ్చారు. అయితే దానికి తగ్గట్టు సౌండ్ చేయడం లేదు బొత్స. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లడం లేదు. అదే సమయంలో శాసనమండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ ఆ స్థాయిలో బొత్స మాట్లాడడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం శాసనమండలిలో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పలేకపోతున్నారు మంత్రులు. ఒక విధంగా ఇది ఇబ్బందికరమైన విషయమే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల దూకుడు.. బొత్సలో కనిపించడం లేదు. ఆయన ఇంకా పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. పెద్దమనిషి పాత్రలోనే ఉన్నారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నారే కానీ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేకపోతున్నారు బొత్స.

శాసనమండలిలో తరచు బొత్స నోటి నుంచి ఒక మాట వినిపిస్తోంది. మేం చెప్పాం మీ ఇష్టం అనే నిరాశవాదంతో మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాడు వాడి కర్మాన పోతాడు అంటూ తేలికగా మాట్లాడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల సమయంలో అలా మాట్లాడుతుండడంతో.. కూటమి ప్రభుత్వం చేస్తున్నది కరెక్టేనన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చుతుంది.

శాసనమండలిలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని బొత్స గ్రహించుకోవాలి. ఇప్పటివరకు శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. ఆ పార్టీకి చెందిన వ్యక్తి శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు. గట్టి వాయిస్ వినిపించుకోవడానికి మంచి అవకాశం ఇప్పుడు ఉంది. కానీ ఎందుకో బొత్స వెనక్కి తగ్గుతున్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తూనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో గొంతు కలిపితే మాత్రం కూటమి ప్రభుత్వం ఇరుక్కోవాల్సిందే. మరి ఏం చేస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!