సాక్షి మీడియాపై కుట్ర జరుగుతోందా? దానిని క్లోజ్ చేయాలన్న ప్రయత్నంలో కూటమి సర్కార్ ఉందా? ఎట్టి పరిస్థితుల్లో సాక్షి ఉండకూడదని భావిస్తోందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సాక్షిని క్లోజ్ చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. జగన్మోహన్ రెడ్డి పై అవినీతి కేసులు పెట్టినప్పుడే సాక్షి మీడియాను క్లోజ్ చేయాలని చూశారు. కానీ నుంచి అభ్యంతరాలు రావడంతో అప్పట్లో ఆ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో మరోసారి సాక్షిని క్లోజ్ చేయాలన్న ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
తెలుగు నాట ఎల్లో మీడియా హవా నడుస్తున్న క్రమంలో.. తమకంటూ ఒక సొంత మీడియా ఉండాలని పరితపించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే 2008లో ఇందిరా మీడియా నెట్వర్క్ పేరిట సాక్షి పత్రికతో పాటు టీవీ ఛానల్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటివరకు ఎల్లో మీడియా చెప్పిందే వేదం అన్నట్టు ఉండేది పరిస్థితి. సాక్షి మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా మారింది. మీడియా వర్గాల్లో ఆధిపత్యానికి గండి పడింది. మీడియా ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. చాలామంది బాగుపడ్డారు కూడా.
అయితే అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించారు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి మరణంతో చాలామంది గుండెలు ఆగాయి. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా చాలామంది చనిపోయారు. వారి కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డిని అడ్డగించింది కాంగ్రెస్ నాయకత్వం. ఆయన వెనక పోయేసరికి అవినీతి కేసులను తెరపైకి తీసుకొచ్చింది. 16 నెలల పాటు జైలులో పెట్టింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి బలమైన గొంతుకగా సాక్షి నిలిచింది. దానికి కూడా అవినీతి మరకలు అంట కట్టి క్లోజ్ చేసే ప్రయత్నం అప్పట్లో జరిగింది. అయితే న్యాయస్థానం కలుగజేసుకోవడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది.
అయితే ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం జరుగుతోంది. కూటమి ప్రభుత్వానికి బలమైన మీడియా మద్దతు ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ ఛానళ్లు బలమైన మద్దతు దారులుగా నిలిచాయి. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియాతో పాటు టీవీ9, ఎన్టీవీ, టెన్ టీవీ అండగా నిలుస్తూ వచ్చాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ మూడు టీవీ ఛానల్ న్యూట్రల్ పద్ధతిని అనుసరిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిగిలింది ఒకే ఒక్క సాక్షి మాత్రమే. దానిని సైతం అడ్డు తొలగించుకునేందుకు కూటమి ప్రభుత్వం సాక్షిపై పడినట్లు తెలుస్తోంది. సాక్షిని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.