వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనసేనలో చేరుతారా? ఆ ఎమ్మెల్యే ఎవరు? జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే గెలిచిన నాయకుల్లో కూడా.. దూకుడు కలిగిన నేతలు లేరు. పైగా ఎక్కువమంది రిజర్వ్ నియోజకవర్గం. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి గెలిచారు. వీరే ఎంతో కొంత పేరు మోసిన నాయకులు. మిగతా ఎమ్మెల్యేలు మాత్రం రిజర్వుడు నియోజకవర్గాల నుంచి గెలుచుకుని వచ్చారు.
అయితే రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. మొన్నటికి మొన్న శాసనసభకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ కండువాలతో అందరూ కనిపించారు. ఒక్క ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం కండువా లేకుండా వచ్చారు. దీంతో ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి తీసుకెళ్తారని ప్రచారం నడుస్తోంది. ఈనెల 14న జరిగే జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ సైతం జనసేన తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక మాజీమంత్రి ఆదిమూలం సురేష్ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.
ఎర్రగొండపాలెం నుంచి మూడుసార్లు ప్రాతినిధ్య వహించారు ఆదిమూలపు సురేష్. తొలిసారిగా 2009లో గెలిచారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో గెలవడంతో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఆ పార్టీలో ఐదేళ్లపాటు మంత్రిగా వ్యవహరించింది ఆదిమూలపు సురేష్. అదే జిల్లాకు చెందిన బాలినేని మాత్రం మూడు సంవత్సరాలకే పరిమితమయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే బాలినేని పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవడానికి ప్రధాన కారణం ఆదిమూలపు సురేష్ అన్న ప్రచారం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆదిమూలపు సురేష్ ను కొండేపి నియోజకవర్గానికి పంపించారు. అక్కడ ఓటమి పాలు కావడంతో సురేష్ తిరిగి ఎర్రగొండపాలెం వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు పొమ్మనలేక పొగ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.