అనకాపల్లి జిల్లాపై జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. పార్టీ పూర్వ వైభవం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ కాపు, వెలమ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు గవర సామాజిక వర్గాన్ని సైతం ప్రోత్సహించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సామాజిక వర్గాల సమన్వయంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ సీనియర్ నేతలుగా ఉన్న కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు కు దిశ నిర్దేశం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహకారంతో.. అన్ని నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేలా బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
నిన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనకాపల్లి జిల్లాలో దారుణ దెబ్బ తగిలింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి మాజీమంత్రి బూడి ముత్యాల నాయుడు బరిలో దిగారు. ఆయనపై విజయం సాధించారు బిజెపి అభ్యర్థి సీఎం రమేష్. అయితే అదే జిల్లాకు చెందిన వంగలపూడి అనిత మంత్రి అయ్యారు. దీంతో అనిత తో పాటు సీఎం రమేష్ అక్కడ పట్టు బిగిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అలెర్ట్ అయ్యారు.
చోడవరం నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు కరణం ధర్మశ్రీ. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అందుకే ఆయనకు అనకాపల్లి జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు చోడవరం బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఇచ్చారు. మరో నేత గుడి ముత్యాల నాయుడు మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. జగన్ క్యాబినెట్లో మంత్రి తో పాటు డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఆయనది వెలమ సామాజిక వర్గం. అందుకే కాపు, వెలమ సామాజిక వర్గాల నేతలు సమన్వయంగా ముందుకు సాగితే అనకాపల్లి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో జనసేన ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎంపీగా మాత్రం బిజెపి నేత సీఎం రమేష్ అన్నారు. ఎంపీ సీఎం రమేష్ పెత్తనం పెరుగుతోందన్న ఆవేదన కూటమి పార్టీ ఎమ్మెల్యేలలో ఉంది. పైగా ఎక్కడో రాయలసీమ జిల్లాకు చెందిన నేత ఎక్కడ పెత్తనం చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సహజంగా ఇది కూటమి పార్టీలో విభేదాలకు కారణం అవుతోంది. రోజురోజుకు మూడు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం లోపిస్తోంది. ఇటువంటి సమయంలోనే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల అనకాపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పై ఫుల్ ఫోకస్ పెట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకుంది.