వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. 22 పార్లమెంట్ స్థానాల నుంచి నాలుగు సీట్లకు దిగిపోయింది. ప్రజా ఆగ్రహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచు కోటలు బద్దలయ్యాయి.
అయితే ఇంతటి ఘోర ఓటమిని ఊహించలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దారుణ అవమానం ఎదురుకావడంతో వైసిపి కీలక నాయకుల సైతం సైలెంట్ అయ్యారు. సీనియర్లు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ ఇటువంటి సమయంలో సినీ రంగం నుంచి జగన్మోహన్ రెడ్డికి అనూహ్య మద్దతు లభిస్తుండడం విశేషం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై మాట్లాడారు ప్రముఖ నటుడు సుమన్. అసలు జగన్మోహన్ రెడ్డి కి ఓటమి లేదన్నారు. కానీ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఓడించారన్నారు. అక్కడే జగన్మోహన్ రెడ్డి బలం తెలుస్తుందన్నారు. అయితే ఓటమి ఓటమి కానీ.. అది అసలు ఓటమి కాదన్నారు. సీట్ల పరంగా చూస్తే అది ఓటమి అని.. ఓట్ల పరంగా చూస్తే తక్కువ మార్జిన్ అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు సుమన్.
జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రస్తావించారు సుమన్. ఆస్పత్రులను సుందరంగా తీర్చిదిద్దిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని కోరారు. పాఠశాలల రూపురేఖలు మార్చారని.. డిజిటల్ విద్యకు అంకురార్పణ చేశారని.. మరుగుదొడ్లతో పాటు తరగతి గదులను సైతం సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు సుమన్.
చేసింది చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, మంచిని చెబుతుండడం విశేషం. పైగా సినీ రంగం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఓ స్టార్ హీరో తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతుంటారు నటుడు సుమన్. రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు. ఆయన పాలనను స్లాగించారు. దీంతో సుమన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.