Sunday, March 16, 2025

పడి లేచిన కెరటం వైయస్సార్ కాంగ్రెస్.. 15వ పడిలోకి!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్.. యువజన శ్రామిక రైతు పార్టీ.. 14 ఏళ్ళు పూర్తి చేసుకుని 15వ యాటలోకి అడుగుపెడుతోంది. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత పురుడుబోసుకున్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఊహించని జయాలు, అపజయాలు చవిచూసింది. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దానిని అధిగమించేందుకు చెమటోడ్చుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఒక చరిత్ర. ఒక అధ్యయనం కూడా. అటువంటి పార్టీ 15వ పడిలో పడింది.

పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో అచేతనంగా ఉండేది. ఆ సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపి.. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. తన రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనను ఎంతో గౌరవించింది. రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేసింది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వందలాదిమంది చనిపోయారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు సిద్ధపడ్డారు. దానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. అలాగని జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితమే 16 నెలల పాటు జైలు జీవితం.

కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన తండ్రి ఆశయాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని భావించి.. జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇలా పార్టీ ప్రారంభించిన ఏడాదికే 17 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. 2014 మేలో జరిగిన ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు.

తొలి ప్రయత్నం లోనే ప్రతిపక్షానికి పరిమితం అయిన వైయస్సార్ కాంగ్రెస్.. 2019లో చేసిన మలి ప్రయత్నంలో అధికారంలోకి రాగలిగింది. అయితే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి కఠోర శ్రమ ఉంది. రైతు భరోసా యాత్ర, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చేపట్టిన ధర్నా వంటి కార్యక్రమాలు కలిసి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3648 కిలోమీటర్ల మేర జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజల మద్దతు లభించింది. 2019 ఎన్నికల్లో అధికారానికి రావడానికి దోహద పడింది. 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన తీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపింది.

అయితే 2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయంతో దేశం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే స్థితిలో అపజయాన్ని మూటగట్టుకున్నారు. సుదీర్ఘ మజిలీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. అయితే ప్రజా రంజక పాలన అందించి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కునే పనిలో పడ్డారు. ప్రజల్లోకి బలంగా వెళ్లి పూర్వ వైభవం పొందేందుకు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలీకృతం కావాలని కోరుకుందాం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!