విజయసాయిరెడ్డి సరికొత్త అవతారం ఎత్తారు. ఇంతవరకు ఆయన రాజీనామా వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంతా భావించారు. కానీ ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాకినాడ సి పోర్టు వివాదంలో ఆయనకు సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అబాండాలు వేశారు. జగన్మోహన్ రెడ్డి తీరును కూడా తప్పు పట్టారు.
విజయసాయిరెడ్డి ఓ సామాన్య ఆడిటర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి లెక్కలు చెప్పే ఒక సాధారణ ఉద్యోగి. అటువంటి వ్యక్తికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన కుటుంబ చిట్టాపద్దులు రాయడమే కాదు.. తన కుటుంబ సభ్యుడిగా కూడా పరిగణించారు. ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అవి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి సైతం కేసుల్లో చిక్కుకున్నారు. తనతో పాటు జైలు జీవితం అనుభవించారు విజయసాయిరెడ్డి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తెరిగి విజయసాయి రెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖరరెడ్డికి సమకాలీకులు పార్టీలో ఉన్నారు. కానీ వారందరినీ కాదని విజయసాయి రెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఎవరు ముఖ్యం? అంటే ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. కానీ అదే విజయసాయిరెడ్డి దొంగే దొంగ అన్నట్టు ఉంది వ్యవహారం.
విజయసాయి రెడ్డికి పార్టీతో పాటు ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలోనే అభ్యంతరాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించినప్పుడు సీనియర్లు చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ వారందరినీ వారించి బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రధాన కోటరీ విజయసాయి రెడ్డి కదా? మరి ఆయనే కోటరీ వల్ల తాను పార్టీకి దూరమయ్యానని చెప్పడం ఎంతవరకు సమంజసం.
విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా నియమించారు జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానుల నిర్ణయం తో విశాఖకు ఒక సామంత రాజుగా విజయసాయిరెడ్డిని నియమించారు. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన పని చేయాలి. కానీ ఆయన చేసింది ఏంటి? విశాఖ నగరాన్ని తన కుటుంబ సభ్యులకు రాసిచ్చే విధంగా వ్యవహరించారు. దానిని తప్పు పడితే నేరమా? ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించడం తప్పిదమా?
కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఇదే వై వి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి వెనుకేసుకు రాలేదా? చిన్నపిల్లడి పై ఆరోపణలను తప్పు పట్టలేదా? మరి ఇప్పుడు అదే విక్రాంత్ రెడ్డి విషయంలో ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నట్టు? అదే వైవి సుబ్బారెడ్డి పై నెపం ఎందుకు నెడుతున్నట్టు? ఇది ముమ్మాటికి పొలిటికల్ స్ట్రాటజీ మాత్రమే.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం మాత్రమే.. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా..