తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ అజెండా ఉందా? పరస్పర రాజకీయ ప్రయోజనాలకు ఒక ఒప్పందం చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తొలుత తెలంగాణకు సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి. అటు తరువాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది. అలాగని రెండు రాజకీయ విభేదిత ప్రభుత్వాలే. కానీ ఎక్కడ ఆ ప్రభావం కనిపించదు. దానికి వన్ అండ్ ఓన్లీ కారణం చంద్రబాబుకు రేవంత్ ఒకప్పటి సన్నిహితుడు, శిష్యుడు, శ్రేయోభిలాషి కావడం కారణం.
అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుకు బద్ధ విరోధి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి అంతగా పొసగదు. అందుకే ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నలుగురు నేతలు గట్టిగానే పోరాడుతున్నారు.
సాధారణంగా వైయస్సార్ కాంగ్రెస్ లో ఉన్న వారంతా ఒకప్పటి కాంగ్రెస్ నేతలే. వారికి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ లో ఒకప్పటి తెలుగుదేశం నేతలే అధికం. ఇక్కడే ఒక ఆలోచనకు వచ్చారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. తెలంగాణలో టిడిపి బలపడాలి. ఆంధ్రాలో కాంగ్రెస్ బలోపేతం కావాలి. అప్పుడే రాజకీయ ప్రత్యర్థులు పతనం అవుతారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కాంగ్రెస్ లోకి రప్పించాలి. బిఆర్ఎస్ నేతలను టిడిపిలోకి రప్పించాలి. ఇప్పుడు ఆ ఇరువురు నేతలు ఆడుతున్న గేమ్ అదే.
ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి బలపడకూడదు. అదే సమయంలో తెలంగాణలో కెసిఆర్ పార్టీ బలం పుంజుకోకూడదు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆయన ఆ ఇద్దరు నేతలకు ఉమ్మడి శత్రువు. అందుకే రేవంత్ ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఏపీలో 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ను బలోపేతం చేస్తానని.. అందుకు తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరినట్లు సమాచారం. అయితే చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్, కెసిఆర్లు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి శత్రువులు. అందుకే వారు చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారే అవకాశం ఉంది. అయితే చంద్రబాబును ఆ ఇద్దరు నేతలు ఎలా కట్టడి చేయగలరో చూడాలి.