చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అంటారు. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలే శాపంగా మారుతాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి ఇది ఇట్టే వర్తిస్తుంది. సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకోకుంటే ఎన్నో రకాల మూల్యాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాటి ద్వారా లాభం కంటే నష్టం అధికంగా జరుగుతుంది. వంగవీటి రాధాకృష్ణ విషయంలో జరిగింది అదే. రాజకీయ తప్పుడు నిర్ణయాలతో ఆయన పొలిటికల్ కెరీర్ ను జేజేతులా పాడు చేసుకున్నారు.
ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగాది ప్రత్యేక స్థానం. విజయవాడలో అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మోహన్ రంగా అనతి కాలంలోనే రాష్ట్ర నాయకుడిగా మారిపోయారు. రాష్ట్రంలోనే ప్రభావంతమైన వ్యక్తిగా అవతరించారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సాధారణ ఎమ్మెల్యే అయినా.. అసాధారణ ప్రభావం చూపడం విశేషం. ఈ క్రమంలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు.
1988లో అణగారిన వర్గాల ప్రజల కోసం ఆయన నిరసన దీక్షకు దిగారు. అదే దీక్షా శిబిరంలో దారుణ హత్యకు గురయ్యారు. దానికి మూల్యం చెల్లించుకుంది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. కేవలం టిడిపి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే రంగా హత్య జరిగిందన్న ఆరోపణలు రావడంతోనే అలా జరిగింది.
అయితే సీన్ కట్ చేస్తే.. 2003లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. రంగా వారసుడిగా రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. చిన్న వయసులోనే సీటు ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన చిన్నవయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
అయితే రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు వంగవీటి రాధాకృష్ణ. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. కేవలం కుల ప్రాతిపదికన ఆ నిర్ణయం తీసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్దని వారించిన పెద్దాయన మాట వినలేదు. ప్రజారాజ్యం పార్టీలో చేరి చేతులు కాల్చుకున్నారు. అదే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో తన నిర్ణయం తప్పని బాధపడ్డారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వంగవీటి రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి రాధాకృష్ణకు యువజన విభాగం బాధ్యతలను అప్పగించారు. దురదృష్టవశాత్తు 2014 ఎన్నికల్లో ఓడిపోయారు వంగవీటి రాధాకృష్ణ. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2019లో ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. కానీ నాడు తప్పుగా భావించారు రాధాకృష్ణ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఇవ్వకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి సముదాయించినా ఫలితం లేకపోయింది. అలా నాడు రాజకీయ తప్పిదమైన నిర్ణయం తీసుకున్నారు. టిడిపిలో చేరారు.
2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయేసరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయితే గత ఐదేళ్లుగా టిడిపిని అంటిపెట్టుకొని కొనసాగారు. పోనీ 2024 ఎన్నికల్లో ఆయన టిడిపి టికెట్ సాధించారా? అంటే అది లేదు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నామినేటెడ్ పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ పదవులు సైతం వరించలేదు. రాజకీయాల్లో కోరిన వచ్చే స్థాయి నుంచి.. అడిగే స్థాయికి చేరుకున్నారు ఈ వంగవీటి వారసుడు. నాడు తండ్రి రాజశేఖర్ రెడ్డి మాట వినినా.. లేకుంటే కుమారుడు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుచుకున్నా.. వంగవీటి పొలిటికల్ కెరీర్ ఇలా ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే వరుసగా రాజకీయ తప్పిదాలు, పదవులు రాకపోవడానికి సహించుకోలేకపోతున్న వంగవీటి రాధాకృష్ణ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాజకీయాలకు శాశ్వతంగా దూరం జరగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.