Wednesday, March 19, 2025

ఎమ్మెల్సీల ఎంపిక.. రెడ్డి, కమ్మ సామాజిక వర్గంలో ప్రకంపనలు!

- Advertisement -

ఇద్దరు కాపులు, ఇద్దరు బీసీ, ఒక ఎస్సి.. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల కూర్పు ఇది. ఏపీలో ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ముందుగా జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు ను ఖరారు చేశారు. ఆయన కాపు సామాజిక వర్గ నేత. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు చాన్స్ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో దిగారు. బీసీ వర్గాల నుంచి బీదా రవిచంద్ర, బిటి నాయుడు.. ఎస్సీ వర్గం నుంచి కావలి గ్రీష్మ పోటీ చేస్తున్నారు. అయితే కూటమి అధికారంలో ఉండడం, కూటమి తరుపున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో వీరి ఎన్నిక లాంఛనమే.

అయితే కూటమి నిర్ణయంతో రెండు సామాజిక వర్గాల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూటమి పార్టీలో ఉన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన బీటెక్ రవి, బిజెపి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఈ ఎన్నికలకు ముందు కుటుంబాన్ని విభేదించి మరి టిడిపిలో చేరారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఈ సామాజిక వర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. కూటమిలో ఏదో ఒక పార్టీ ద్వారా పదవి ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

కమ్మ సామాజిక వర్గానిది అదే పరిస్థితి. కనీసం ఆ సామాజిక వర్గం నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా గుర్తించలేదు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు కోసం పాటుపడింది కమ్మ సామాజిక వర్గం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ ప్రముఖులు తరలివచ్చారు. అహోరాత్రులు శ్రమించారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్, పరుచూరి అశోక్ బాబు వంటి నేతలు ఎమ్మెల్సీ పదవులను ఆశించారు.

మరోవైపు బీసీల నుంచి సైతం చాలా సామాజిక వర్గాల నేతలు పదవులను ఆశించారు. ఉత్తరాంధ్ర నుంచి వెలమ సామాజిక వర్గం, రాయలసీమలో శెట్టిబలిజ, కురుబ, మత్స్యకార నేతలు ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. కానీ వారి ఆశలను సైతం చిదిమేశారు చంద్రబాబు. దీంతో ఎమ్మెల్సీల ఎంపికపై అన్ని వర్గాల నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!