ఈసారి జనసేన ప్లీనరీ భారీగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావించారు. పిఠాపురంలో భారీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన మంచి విజయం సాధించింది. ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. త్వరలో మెగా బ్రదర్ నాగబాబుకు సైతం పదవి తప్పదని తేలిపోయింది.
2014 ఎన్నికలకు ముందు ఆవిర్భవించింది జనసేన. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. రెండు చోట్ల మద్దతు తెలిపిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ పాత్ర మరింత పెరిగింది.
అయితే 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఒక్కచోట కూడా గెలవలేదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. ఇక జనసేన పని అయిపోయిందని అంతా భావించారు. కానీ చాలా కష్టపడి పార్టీని నడిపారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపిని కలుపుకెళ్లారు. సూపర్ విక్టరీని సాధించారు.
రాజకీయాల్లో అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్.. ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీ నుంచి ఎక్కువగా చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. పిఠాపురంలో నిర్వహించే జనసేన ప్లీనరీలో భారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు సైతం జనసేనలో చేరుతారని ప్రచారం నడుస్తోంది.
జనసేన ప్లీనరీలో మాజీ మంత్రులు సిద్ధ రాఘవరావు, తోట త్రిమూర్తులు, వంగా గీత, గ్రంధి శ్రీనివాస్, పెండ్యం దొరబాబు, ఆమంచి కృష్ణమోహన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున జనసేనలో చేరుతారని తెలుస్తోంది.
మరో 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా జనసేన తరఫున ప్లాన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన ప్రాతినిధ్యం పెంచేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. మరో 50 అసెంబ్లీ సీట్లతో పాటు 13 పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని అంచనా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో వీలైనంత సీట్లు ఎక్కువగా తీసుకుని.. జనసేన ప్రాతినిధ్యం పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తూనే.. మరోవైపు జనసేన బలోపేతం పై ఫోకస్ పెట్టారు.