ఏపీ టీడీపీ నేతలు కొత్త భయం పట్టుకుంది. ఇకనుంచి ప్రతి పదవిలో షేరింగ్ కోరుతున్నాయి ఆ రెండు పార్టీలు. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే.. అందులో రెండు స్థానాలను ఆ రెండు పార్టీలు కైవసం చేసుకున్నాయి. టిడిపికి మిగిలింది ఆ మూడు మాత్రమే. అంటే ఇకనుంచి ఏ పదవులైన 40 శాతం వదులుకోవాల్సిందే అన్న టాక్ వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 135 సీట్లతో ఒంటరిగానే అధికారంలోకి వచ్చింది. కానీ పొత్తు ధర్మం పాటిస్తూ 21 సీట్లు వచ్చిన జనసేనకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించింది. ఒక డిప్యూటీ సీఎం పదవితో పాటు మూడు మంత్రి పదవులు ఇచ్చింది. మరో పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
బిజెపి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి ఒక మంత్రి పదవి ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో సైతం పెద్దపీట వేస్తున్నారు. రాజ్యసభ సీట్లలో అగ్ర తాంబూలం ఇస్తున్నారు. పోనీ జాతీయస్థాయిలో బిజెపికి రాజ్యసభ మద్దతు అవసరం. అందుకే ఎంపి పదవి ఇచ్చిన పర్వాలేదు. కానీ ఎమ్మెల్సీ పదవిని సైతం బిజెపి పట్టుబడుతుండడం మాత్రం టిడిపిలో ఆందోళనకు కారణం అవుతోంది.
వాస్తవానికి క్షేత్రస్థాయిలో పట్టున్న పార్టీ తెలుగుదేశం. తమతో పొత్తు పెట్టుకుని జనసేన, బిజెపి లాభపడుతున్నాయి అన్నది టిడిపి శ్రేణుల అభిప్రాయం. కానీ టిడిపి తమ ద్వారా భారీగా లబ్ధి పొందింది అన్నది ఆ రెండు పార్టీల అభిప్రాయం. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చంద్రబాబు కూడా ఆ రెండు పార్టీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీలు, రాజ్యసభ పదవుల్లో టాప్ ప్రియారిటి కల్పిస్తున్నారు. అయితే తమ అవకాశాలను కొల్లగొట్టారని టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది.
ఈ నెల చివర్లో పెద్ద ఎత్తున పదవుల పంపకం చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, ఆసుపత్రి కమిటీలు.. ఇలా దాదాపు పదివేలకు పైగా పోస్టులు భర్తీ చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. కానీ ఇక్కడ కూడా 30 నుంచి 40% పదవులు ఆ రెండు పార్టీలకు వెళ్లిపోతాయన్న ఆందోళన టిడిపి శ్రేణుల్లో ఉంది. దీంతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని.. పొత్తుతో పెద్ద నేతలకు పర్వాలేదు కానీ.. తమకు వచ్చిన అవకాశాలు కోల్పోతామన్న ఆందోళన టిడిపి శ్రేణుల్లో ఉంది. నిజంగా 30 నుంచి 40% పదవులు కేటాయిస్తే మాత్రం.. టిడిపి శ్రేణుల్లో కచ్చితంగా ఒక రకమైన ఆవేదన కనిపించడం ఖాయం. అసంతృప్తికి దారి తీయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.