ఏపీ బీజేపీలో తలనొప్పిగా మారారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. గెలిచింది మొదలు వివాదాస్పద నిర్ణయాలతో సొంత పార్టీకే చిక్కులు తెస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నేతలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బిజెపి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు రాయలసీమ జిల్లాలకు చెందిన ఏడుగురు నేతలు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు ఆదినారాయణ రెడ్డి. మూడు పార్టీల మధ్య పొత్తు ఉండడంతో అనూహ్య విజయం సాధించారు. గెలిచింది మొదలు ఆయన బిజెపి శ్రేణులను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. టిడిపి పాత క్యాడర్ తో అన్ని పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆదినారాయణ రెడ్డి 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. మంత్రి పదవిని దక్కించుకున్నారు. అప్పట్లో తన వ్యాపారాల కోసమే ఆదినారాయణ రెడ్డి పార్టీ మారినట్లు ప్రచారం ఉండేది. అయితే తాజాగా అధికారంలోకి వచ్చింది మొదలు వ్యాపారాలపై పడినట్లు తెలుస్తోంది.
మొన్న ఆమధ్య బూడిద పంచాయతీ నడిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు అనంతపురం జిల్లా కు చెందిన జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు బూడిద తరలించేవారు. అయితే ఇకనుంచి బూడిద తరలించేందుకు వీలులేదని ఆదినారాయణ రెడ్డి గట్టిగానే హెచ్చరికలు పంపారు. అయితే జెసి ప్రభాకర్ రెడ్డి సైతం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు పంచాయతీ నడిచింది. సీఎం చంద్రబాబు కలుగు తీసుకుని రాజి చేయాల్సి వచ్చింది.
అయితే జమ్మలమడుగు నియోజకవర్గంలో భారీగా అవినీతికి తెరతీసారన్న ఆరోపణలు ఆదినారాయణ రెడ్డి పై ఉన్నాయి. అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఏడుగురు బిజెపి నేతలు ఆదినారాయణ రెడ్డి పై హై కమాండ్ కు లేఖ రాసినట్లు సమాచారం. అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ఎపిసోడ్ వెనుక సీఎం రమేష్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రమేష్ అనకాపల్లి నుంచి ఎంపీగా బిజెపి నుంచి గెలిచారు. పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టు పొందారు. అక్కడ కూడా ఆదినారాయణ రెడ్డి వాటాలు అడుగుతుండడంతో సీఎం రమేష్ కు చిర్రెత్తుకు వచ్చిందట. అందుకే ఆ ఎనిమిది మందితో కంప్లైంట్ ఇప్పించారట. మొత్తానికి అయితే సీఎం రమేష్ వెనుకుండి ఆదినారాయణ రెడ్డి పని పట్టాలని భావిస్తున్నారని మాత్రం తెలుస్తోంది.