Wednesday, March 19, 2025

బిజెపిలోకి విజయసాయిరెడ్డి.. ముహూర్తం ఫిక్స్!

- Advertisement -

విజయసాయిరెడ్డి బిజెపిలోకి వెళ్తారా? ఆ వార్తలో నిజం ఎంత? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి రాజకీయాలు చేయనని ప్రకటించారు. వ్యవసాయానికి పరిమితం అవుతానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తరచూ రాజకీయ నేతలను కలుస్తుండడం మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల తెలంగాణకు వచ్చిన ఉపరాష్ట్రపతిని ప్రత్యేకంగా కలిశారు విజయసాయిరెడ్డి. అప్పటినుంచి ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి.

ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు విజయసాయిరెడ్డి. వైయస్సార్ కుటుంబ ఆడిటర్ గా ప్రస్తానాన్ని ప్రారంభించారు. తరువాత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి సైతం అవినీతి కేసులు ఎదుర్కొన్నారు. ఆయనతోపాటు జైలుకు వెళ్లారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు.

వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. అవినీతి కేసులు నమోదైన నేపథ్యంలో రాజకీయ పార్టీ పెట్టి ఎదుర్కొందామని అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం.. దానికి వన్ ఆఫ్ ద పిల్లర్ గా నిలబడ్డారు విజయసాయిరెడ్డి. అటువంటి నేత పార్టీ నుంచి బయటకు వస్తారని ఎవరూ ఊహించలేదు కూడా.

అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇక్కడ అవసరాలు మాత్రమే పనిచేస్తాయి. అందుకే ఆయన బిజెపి గూటికి చేరుతారని తెగ ప్రచారం నడుస్తోంది. దానికి కారణాలు లేకపోలేదు. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.

కేంద్ర పెద్దల వద్ద విజయసాయి రెడ్డికి పలుకుబడి ఉంది. ప్రధాని మోడీ సైతం పేరు పెట్టి పిలిచే గుర్తింపు ఉంది. దేశంలోనే శక్తివంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న హోంమంత్రి అమిత్ షా అయితే ఆయనకు ఇట్టే అపాయింట్మెంట్ ఇస్తుంటారు. అందుకే కేంద్ర పెద్దల సూచన మేరకు త్వరలో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరుతారని తెలుస్తోంది.

వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే విజయసాయిరెడ్డికి బిజెపి నుంచి ఆహ్వానం వచ్చిందట. అయితే వెంటనే వెళితే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచానన్న కామెంట్స్ వస్తాయని భావించి విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే జూన్ లో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరికకు ముహూర్తం గా నిర్ణయించినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!