కూటమి ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆగ్రహంగా ఉన్నారా? అందుకే బడ్జెట్ సమావేశాల్లో నిలదీసినంత పని చేశారా? బడ్జెట్ కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఎందుకు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఈ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు సుజనా చౌదరి. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం విశేషం.
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు సుజనా చౌదరి. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత కూడా. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తరువాత భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు. అయితే టిడిపి తో పాటు చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఆయన బిజెపిలోకి వెళ్లారన్న టాక్ ఉంది.
2024 ఎన్నికలకు ముందు బిజెపిని తెలుగుదేశం పార్టీ వద్దకు రప్పించేందుకు పడరాని పాట్లు పడిన నేతల్లో సుజనా చౌదరి ఒకరు అని ఒక ప్రచారం ఉంది. టిడిపి తో బీజేపీ పొత్తు కుదర్చడంలో ఈయనది కీలకపాత్ర. అయితే కేంద్ర రాజకీయాలపై మక్కువ ఉండే సుజనా చౌదరి ఎన్నికల్లో మాత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో పదవి ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో అంచనాలు వెలుపడ్డాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి నుంచి అనూహ్యంగా సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. దీంతో సుజనా చౌదరి సైలెంట్ కావాల్సి వచ్చింది.
మంత్రి పదవి దక్కకపోయేసరికి సుజనా చౌదరి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పెద్దగా యాక్టివ్ గా లేరు. వరదల సమయంలో సైతం పెద్దగా కనిపించలేదు. అదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకు ఇస్తారని ప్రచారం జరిగింది. అది కూడా కలిసి రాలేదు. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి కుమార్తె డిగ్రీ ప్రధాన ఉత్సవానికి సంబంధించి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దీంతో సుజనా చౌదరి తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే కొద్ది సేపటికి ఆ పోస్టును డిలీట్ చేశారు చౌదరి.
ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగం చేశారు చౌదరి. అప్పులతో బడ్జెట్ రూపొందించడం ఏమిటని నిలదీసినంత పని చేశారు. ప్రతి పైసా తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులు కేటాయింపు ఏంటని నిలదీశారు. సంపద సృష్టి లేకుండా అప్పులతో బడ్జెట్ ఏంటనేది చౌదరి గారి అభిప్రాయం. అయితే ఈ పరిణామాలతో చంద్రబాబు సైతం షాక్కుకు గురయ్యారు. తన సన్నిహిత నేత ఆగ్రహానికి కారణం ఏంటని ఆరా తీసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే సుజనా చౌదరి కూటమిలో సరికొత్త ప్రకంపనలు రేపుతున్నారు.