పిఠాపురం వర్మ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు డిసైడ్ అయ్యారా? ప్రస్తుతం పదవి కంటే.. భవిష్యత్తులో పిఠాపురంలో అవకాశం చేజిక్కించుకోవడానికి ఇష్టపడుతున్నారా? టిడిపిలో ఉంటే భవిష్యత్తు లేదని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో సీటు త్యాగం చేశారు వర్మ. గత ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన ఆయన పోటీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆ సీటును తన్నుకు పోయారు. ఇప్పుడు ప్రాతినిధ్యం లేకపోగా కనీసం త్యాగానికి విలువ లేకుండా పోయింది. దీంతో వర్మ ఒక రకమైన ఆందోళన చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురం విషయంలో సుదీర్ఘ వ్యూహంతో ఉన్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్మోహన్ రెడ్డికి పులివెందుల శాశ్వత నియోజకవర్గాలు. అదే మాదిరిగా పిఠాపురం తన శాశ్విత నియోజకవర్గంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇది వర్మ కు మింగుడు పడడం లేదు. పిఠాపురం పై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆయన ఆవేదనతో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేస్తే తనకు కనీసం గుర్తింపు లేకపోవడాన్ని వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తనను పక్కన పెట్టడాన్ని సహించుకోలేకపోతున్నారు. కనీసం పిఠాపురం నియోజకవర్గంలో సైతం టిడిపి నేతగా తనను గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఎమ్మెల్సీ నీదేనంటూ నమ్మించారని.. కానీ దారుణంగా మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకోవైపు తనను నియంత్రించే క్రమంలో తన చిరకాల ప్రత్యర్థులను జనసేనలో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వర్మ అనుమానిస్తున్నారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు వర్మ. నియోజకవర్గంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అదే వర్మను 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండ్యం దొరబాబు ఓడించారు. ఒక విధంగా చెప్పాలంటే దొరబాబు వర్మకు చిరకాల ప్రత్యర్థి. అటువంటి నేతను తనకు సంప్రదించకుండానే జనసేనలో చేర్పించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు మాజీ ఎంపీ వంగ గీతను సైతం జనసేనలోకి రప్పించేందుకు చూస్తున్నారు. ఇదంతా తనను నిలువరించేందుకేనని అనుమానిస్తున్నారు వర్మ.
ఎమ్మెల్సీ పదవికో.. నామినేటెడ్ పదవి కోసం ఆశపడితే పిఠాపురం నియోజకవర్గంలో తన ఉనికికి చేటు వస్తుందని వర్మ భావిస్తున్నారు. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన ప్రధాన అనుచరులతో సమావేశం నిర్వహించి.. కూటమిలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించే ప్రయత్నం చేశారు. టిడిపిలో ఉంటే భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గం పై ఆశలు వదులుకోవాల్సిందేనని అనుచరులు సైతం తేల్చి చెబుతున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సరైన హామీ ఇస్తే.. ఆ పార్టీలో చేరేందుకు వర్మ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి దాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.