ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. పట్టభద్రులతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మరోవైపు ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం అయింది. ఈనెల 20న పోలింగ్ జరగనుంది. అయితే కూటమి ఏకపక్ష మెజారిటీతో ఉండడంతో ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అయితే ఈ ఐదు స్థానాల్లో ఒకటి జనసేనకు రిజర్వ్ అయింది. ఆ పార్టీ అభ్యర్థిగా నాగబాబు బరిలో దిగనున్నారు. అయితే ఈసారి బిజెపికి ఎమ్మెల్సీ సీటు కేటాయించే అవకాశం లేదు. నాలుగు స్థానాలు టీడీపీకి దక్కనున్నాయి. అయితే ఆశావహులు ఓ డజను మంది వరకు ఉన్నారు. దీంతో ఎవరికి వారు పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
తప్పకుండా కుల సమీకరణలను పరిగణలోకి తీసుకుంటారు. నాగబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. టిడిపి నుంచి కాపులకు ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది. కానీ జాబితాలో మాత్రం కాపు నేతలు అధికంగా ఉన్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలో చంద్రబాబుకు తెలియడం లేదు.
ప్రధానంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన సీటు త్యాగం చేశారు. మరో నేత కొమ్మలపాటి శ్రీధర్ కూడా పదవి ఆశిస్తున్నారు. చివరి నిమిషంలో భాష్యం ప్రవీణ్ ఎంట్రీ తో పోటీ నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్సీగా రిటైర్ అయిన పరుచూరి అశోక్ బాబు సైతం మరోసారి పదవిని కోరుకుంటున్నారు. టిడిపికి తెర వెనుక బలంగా పనిచేసే నేత ఈయన. అయితే ఈ ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. వీరిలో ఒక్కరికి మాత్రమే పదవి దక్కే పరిస్థితి ఉంది.
మరోవైపు వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు ఈయన. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి టిడిపిలో చేరారు. 2024 ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ దక్కలేదు. అయినా సరే కూటమి తరపున ప్రచారం చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సైతం పదవి కోరుకుంటున్నారు. గత ఐదేళ్లుగా పార్టీ వాయిస్ బలంగా వినిపించారు. అయితే ఈ ఇద్దరు నేతలు సైతం విజయవాడకు చెందిన వారే. ఇందులో ఒక్కరికి మాత్రమే ఎమ్మెల్యేగా ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు బీసీ వర్గాల నుంచి బీద రవిచంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన సైతం కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారు. మరోవైపు అదే బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ సైతం ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. రాజ్యసభ పదవి వదులుకొని మరి పార్టీలో చేరారు. అందుకే తనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు.
మరోవైపు పిఠాపురం వర్మ తనకు పదవి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీట్ త్యాగం చేశారు ఆయన. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి నామినేటెడ్ పదవి వర్మకు దక్కుతుందని అంత చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు ఆయనకు నిరాశ మిగులుతోంది. ఈసారి తప్పకుండా తనకు అవకాశం ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు.
ఇంకోవైపు విజయనగరం జిల్లాకు చెందిన బంగార్రాజు ఎమ్మెల్సీ పదవి కోసం పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా నెల్లిమర్ల నియోజకవర్గం లో టిడిపి అభివృద్ధికి చాలా కృషి చేశారు. లోకేష్ పాదయాత్ర ముగింపును తన నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. విజయవంతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ ఎన్నికల్లో నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించారు. అప్పట్లో కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన సైతం పదవి కోసం పట్టుబడుతున్నారు.
మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సైతం మరోసారి తనకు ఎమ్మెల్సీ ని చేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్మెంట్ అయిన వారిలో సైతం చాలామంది రెన్యువల్ కోసం ఆశిస్తున్నారు. అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు చంద్రబాబుకు కత్తి మీద సాములా మారాయి.