వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? తిరిగి నెల్లూరు జిల్లాలో రాజకీయం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడిప్పుడే యాక్టివ్ కావడం ప్రారంభించారు. అటువంటి వారిని పిలిచి బాధ్యతలు అప్పగిస్తున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను సైతం అలానే పిలిచి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
రెండు రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వ దూకుడుకు భయపడి ఆయన సైలెంట్ అయ్యారని ప్రచారం జరిగింది. వాటన్నింటికీ చెక్ చెబుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను పిలిచి కీలక బాధ్యతలు కట్టబెట్టారు.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు తానేటి వనిత. చివరి రెండేళ్లు ఈ రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమె పార్టీలో యాక్టివ్ అవుతానని చెప్పారు. దీంతో ఆమెను గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా కూడా నియమించారు.
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా ఒక వెలుగు వెలిగిన నేతలు అందరిని పిలిచి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా కొద్దిరోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అవకాశం ఉంది. తిరిగి ఆయనకు నెల్లూరు జిల్లాలో కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అటు తరువాత 2014, 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ను తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కీలకమైన సాగునీటి శాఖను అప్పగించారు. అయితే విస్తరణలో భాగంగా మంత్రి పదవి కోల్పోయారు అనిల్ కుమార్ యాదవ్. అక్కడ నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి.
2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి తప్పించారు అనిల్ కుమార్ యాదవ్ ను. పక్క జిల్లా అయిన నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. అప్పటినుంచి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ తరుణంలో ఒక రకమైన గ్యాప్ కనిపిస్తోంది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ ను పిలిచి నెల్లూరులో కీలక బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. మరి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.