ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు మాజీమంత్రి అప్పలరాజు. ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్న వెనక్కి తగ్గడం లేదు. అయితే ఆయన చుట్టూ ఉచ్చుబిగుస్తున్నట్లు సమాచారం. దానికి కారణాలు లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడుగా ఉండేవారు అప్పలరాజు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పలాసలో వైయస్సార్ కాంగ్రెస్ వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి ఉండేది.
పలాసలో బలమైన గౌతు కుటుంబం ప్రాతినిధ్యం వహించేది. అటువంటి చోట విద్యాధికుడుగా ఉన్న డాక్టర్ అప్పలరాజును బరిలోదించారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో అప్పలరాజు సూపర్ విక్టరీ సాధించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజును తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలా కొత్తగా ఎన్నికైన అప్పలరాజును ప్రోత్సహించేసరికి.. ఆయన అధినేత జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు.
అయితే టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు గౌతు లచ్చన్న మనుమరాలు శిరీష. తనపై అప్పలరాజు గెలుపును జీర్ణించుకోలేకపోయారు. అప్పలరాజుతో దీటుగా రాజకీయాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ వ్యక్తిగత వైరంగా మారిపోయింది. గత ఐదేళ్లలో శ్రీకాకుళం అంటే పలాస రాజకీయాలే అందరికీ గుర్తొచ్చేవి. అయితే కూటమి ప్రభంజనంలో తాజాగా అదే అప్పలరాజు పై గెలిచారు గౌతు శిరీష. అప్పటినుంచి పలాసలో రివేంజ్ రాజకీయాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి అప్పలరాజు పై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.
అయితే ఎట్టి పరిస్థితుల్లో మాజీ మంత్రి అప్పలరాజును జైలు పాలు చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష భావిస్తున్నారు. అందుకు సంబంధించి అన్ని రకాల వ్యూహాలు రూపొందించారు. ఇటీవల ఓ ప్రజా సంఘ నాయకుడు ఒకరు చనిపోయారు. ఆయన మృతి పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు మాజీమంత్రి. ఈ క్రమంలో కాశీబుగ్గ పోలీసులకు వినతి పత్రం అందించారు. పోలీస్ దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో నిరసన తెలిపారు. దానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే తన చుట్టూ కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి అప్పలరాజుకు తెలుసు. అయినా సరే దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ ఐదేళ్లపాటు ఇబ్బందులు పెడతారని.. మరి తరువాత వారి పరిస్థితి ఏంటని గుర్తించుకోవాలని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. చివరి వరకు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటానని.. కేసులకు భయపడే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పలాస రాజకీయం సెగలు పుట్టిస్తోంది.