వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడిందా? ఇన్నాళ్లకు గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకున్నారా? తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల 90 శాతం మండల పరిషత్తులు తిరిగి దక్కించుకోవడం వెనుక క్యాడర్ కృషి ఉంది. లీడర్ల కంటే క్యాడర్ బలంగా నిలబడి కూటమి దూకుడుకు కళ్లెం వేయడం చిన్న విషయం కాదు.
అధికారంలో ఉన్నప్పుడు అంతా వలంటీర్ల చేతిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అంతిమంగా అది క్యాడర్ను పార్టీకి దూరం చేసింది. అసలు కేడర్కు పని లేకుండా పోయింది. అధికారంలోకి వస్తే తమకు ప్రాధాన్యం ఉంటుందని భావించిన క్యాడర్ కు చుక్కెదురైంది. అందుకే ఎన్నికల్లో క్యాడర్ ఆశించిన స్థాయిలో పనిచేయలేదు.
అయితే ఈ లోపాన్ని ఎన్నికల ఫలితాల అనంతరం గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే తాను మారానని.. జగన్ 1.0 ప్రజల కోసమని.. జగన్ 2.0 మాత్రం పార్టీ క్యాడర్ కోసమేనని తేల్చి చెప్పారు. అయితే ఆ ఒక్క మాట క్యాడర్లో ఊపు తెచ్చింది. అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఓ టానిక్ లా పనిచేసింది.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిప్యూటీ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పెద్దగా పట్టించుకోలేదు. క్యాడర్ సైతం తనకెందుకులే అని పక్కన పెట్టింది.
అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కేడర్ కు ప్రాధాన్యం ఇస్తానన్న ప్రకటనతో మొత్తం రీఛార్జ్ అయ్యారు పార్టీ శ్రేణులు. మండల పరిషత్ ఉప ఎన్నికల్లో 90 శాతం స్థానాలను నిలబెట్టుకున్నారు. అదే ధైర్యంతో పోరాడి కూటమికి ధీటుగా నిలబడ్డారు. మండల స్థాయి నాయకులు, మండల స్థాయి క్యాడర్ కీలక భూమిక పోషించింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సంతృప్తి పొందారు. క్యాడర్ను అభినందనలతో ముంచెత్తారు.
వాస్తవానికి ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో నెంబర్ టు స్థాయి కలిగిన నేతలే పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఐదేళ్లపాటు పదవులు అనుభవించిన వారు, ఆర్థికంగా లబ్ధి పొందిన పెద్దపెద్ద నేతలు అధినేతకు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ క్యాడర్ బలంగా నిలబడడం గొప్ప విషయం. అదే విషయాన్ని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదే ఊపుతో ముందుకు సాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లగలదు కూడా. మరి ఏం జరుగుతుందో చూడాలి.