వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఎప్పుడు? ఆ పార్టీ శ్రేణులు ఇదే చర్చ నడుస్తోంది. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పండుగ అయిపోయి దాదాపు మూడు నెలలు గడుస్తున్న జగన్ జిల్లాల పర్యటన పై క్లారిటీ రాకపోవడం పై రకరకాల చర్చ నడుస్తోంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పోస్టుమార్టం చేశారు. జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ వచ్చారు. అయితే రెట్టింపు సంక్షేమం అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కూటమి గెలుపు దక్కించుకుంది. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు కావస్తున్న ఇంతవరకు హామీలు అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇదే మంచి సమయం అని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానని ప్రకటించారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని వారంలో రెండు రోజులపాటు పర్యటించాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ప్రతి బుధ, గురువారాల్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కీలక నాయకులతో సమావేశం అయి వారి అభిప్రాయాలను తెలుసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో క్యాడర్లో ఒక రకమైన ఆనందం వెల్లివిరిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ రాకపోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది.
సంక్రాంతి నాటికి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. అటు నుంచి వచ్చిన వెంటనే జిల్లా పర్యటనలు ఉంటాయని అంతా భావించారు. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే వరుసగా తాడేపల్లి లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ప్రభుత్వ వైఫల్యాలు మరింత వెలుగులోకి రావాలంటే మరికొంత సమయం ఇవ్వాలని భావించినందునే జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇంకోవైపు పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తున్నారు. కీలక నియోజకవర్గాలకు బాధ్యులను నియమిస్తున్నారు. ఇది ఒక కొలిక్కి వచ్చాక జిల్లా పర్యటనలకు సిద్ధమవుతారని తెలుస్తోంది.
తాజాగా మండల పరిషత్ ఉప ఎన్నికల్లో 90 శాతం స్థానాలను తిరిగి నిలబెట్టుకొంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఏమంత చిన్న విషయం కాదు. కూటమి చాలా దూకుడుగా ఉంది. ఆ దూకుడును తట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే మెచ్చుకోవాల్సిన విషయమే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్ చెక్కుచెదరలేదని అర్థమవుతోంది. ఒకవైపు క్యాడర్ యాక్టివ్ కావడం.. ఇంకోవైపు ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతుండడం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. అందుకే మరి కొద్ది రోజుల్లో జిల్లాల పర్యటన మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది.