బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు సౌండ్ చేస్తున్నారు. తాజాగా జమ్మలమడుగు నుంచి గెలిచారు ఆయన. చివరి నిమిషంలో పొత్తులో భాగంగా సీటు సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుదామని భావించారు. కానీ ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు. అయితే అధికారంలో ఉంటే నోటికి పని చెబుతారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్య మాత్రం ఫుల్ సైలెంట్ పాటించారు. అయితే ఆదినారాయణ రెడ్డి అధికారంలో ఉంటే మాత్రమే మాట్లాడతారు అనేది కడప జిల్లా ప్రజల మాట.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. 2009లో తొలిసారిగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి విజయం సాధించారు. అయితే కొద్ది కాలానికి చంద్రబాబు పార్టీలోకి ఫిరాయించారు. మంత్రిగా అవతారం ఎత్తారు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు.
2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ జమ్మలమడుగు నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు జలక్ ఇచ్చారు. జగన్ ప్రభంజనంతో తెగ భయపడిపోయారు ఆదినారాయణ రెడ్డి. ఆ భయంతోనే బిజెపిలో చేరారు. సేఫ్ జోన్లోకి చేరుకున్నారు. పైగా ఐదేళ్లపాటు ఫుల్ సైలెన్స్ పాటించారు. ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో బిజెపి ద్వారా సీటు సాధించి జమ్మలమడుగు నుంచి మూడోసారి గెలిచారు. అప్పటి నుంచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గెలిచిన తరువాత అవినీతి శకం ప్రారంభం అయినట్లు ప్రచారం నడుస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి నేతలను పట్టించుకోకుండా.. తన సొంత అజెండాతో ముందుకెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని తన వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లు విమర్శలు ఉన్నాయి.
మొన్న ఆ మధ్యన జెసి ప్రభాకర్ రెడ్డితో ఒక వివాదం నడిచింది. అది మరువక ముందే సీఎం రమేష్ తో కూడా లొల్లి పెట్టుకున్నారు. ఈ పంచాయతీ సీఎంవో వరకు వెళ్ళింది. సీఎం చంద్రబాబు సైతం మందలించారట. అయినా సరే ఆదినారాయణ రెడ్డి తీరు మారలేదు. అందుకే బిజెపికి చెందిన రాయలసీమ నేతలంతా ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు బిజెపి హై కమాండ్ గుర్రుగా ఉండడంతో.. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారు ఆదినారాయణ రెడ్డి. హడావిడిగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ ను కడప ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ఆయన అధికారంలో ఉంటే తప్ప మాట్లాడరని తేలిగ్గా తీసుకుంటున్నారు.