ఏపీలో ముస్లింలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అవుతున్నారు. కూటమికి దూరమవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లి తప్పు చేశామని బాధపడుతున్నారు. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ముస్లింల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా వెళ్లాలని కూడా భావిస్తోంది.
ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో ఆ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. కేంద్రంతో మాట్లాడి బిల్లును వెనక్కి తీసుకునేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ చంద్రబాబు చేతులెత్తేసారు. ఈ బిల్లు విషయంలో కేంద్రానికి సానుకూలంగా ఉన్నారు. ఇది ముస్లింలలో ఆగ్రహానికి గురిచేసే అంశం.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రకటించింది. బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే ఓడిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏపీలోని ముస్లింలు కూటమికి దూరం కావడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు.
2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. అప్పటినుంచి ముస్లింలు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. 2014, 2019 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ముస్లింలు ఏకపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపారు. అయితే తాజాగా వక్ఫ్ బిల్లు విషయంలో ముస్లింల పక్షపాతి ఎవరు అనేది తేలిపోయింది. అప్పటినుంచి కూటమిని వ్యతిరేకించడం ప్రారంభించారు. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సైతం మెజారిటీ ముస్లింలు గైర్హాజరయ్యారు. కేవలం కూటమిలోని ముస్లిం ప్రధాన నాయకులు మాత్రమే హాజరయ్యారు.
ఆది నుంచి చంద్రబాబు విషయంలో ముస్లింలలో ఒక రకమైన ఆగ్రహం ఉంది. ముస్లిం వ్యతిరేకి అని ఒక ముద్ర ఉంది. బిజెపితో తెలుగుదేశం పార్టీ జత కట్టడాన్ని ఆది నుంచి ముస్లింలు వ్యతిరేకిస్తూ వచ్చారు. రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి.. మిగతా సమయాల్లో చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు ముస్లింలు. అయితే ముస్లింల ప్రభావిత నియోజకవర్గాలు రాష్ట్రంలో 50 వరకు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. అటువంటి చోట్ల కూటమికి దెబ్బ పడటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముస్లింల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా రాజకీయ లబ్ది పొందనుందని తేలిపోయింది.