ఏపీలో హాట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం , వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గం పులివెందుల తరువాత అంతటి ప్రచారం ఉన్న నియోజకవర్గం గుడివాడనే అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఒకప్పుడు గుడివాడ టీడీపీకి కంచుకోటగా ఉండేది. కొడాలి నాని ఎంట్రీ ఇచ్చిన తరువాత గుడివాడలో పూర్తిగా సీన్ మొత్తం మారిపోయింది. మొదట టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని తరువాట వైసీపీలోకి చేరారు. 2004,2009 ఎన్నికలలో టీడీపీ నుంచి విజయం సాధించిన కొడాలి నాని, తరువాత వైసీపీలో చేరి 2014,2019 ఎన్నికలలో విజయం సాధించి.. టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. వరుసగా నాలుగుసార్లు కొడాలి నాని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ నుంచి రెండుసార్లు, వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన.
గుడివాడలో కొడాలి నానిని ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అవి అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని కొడాలికి ధీటైన అభ్యర్థిని వెతకడంలో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో రావిచర్ల వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేయగా 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌కు టిక్కెట్ ఇచ్చినప్పటికి లాభం లేకుండాపోయింది. దీంతో ఈసారి ఎన్ఆర్ఐని రంగంలోకి దించారు. వెనిగళ్ల రామును గుడివాడ నుంచి పోటీలోకి దించాలని టీడీపీ అధినేత యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే వెనిగళ్ల రాము గుడివాడ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. టీడీపీ నుంచి వెనిగళ్ల రాము గుడివాడలో పోటీ చేయడం దాదాపు ఖాయం అయినట్లుగానే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గుడివాడలో జనసేన పార్టీ కూడా బలంగానే కనిపిస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ మెజార్టీ ఓట్లను సాధించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కూడా ఇక్కడ కీలకంగా వ్యవహరించాలని చూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అనుచరులైన పాలంకి సారధిబాబు, పాలంకి మోహన్‌బాబు ఇద్దరు కూడా వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు.నాని ఇటీవల కాలంలో మరీ శ్రుతి మించి మాట్లాడుతున్నారని, అందుకే తాము పార్టీ మారుతున్నట్లు కారణాన్ని వెల్లడించారు. రాబోవు ఎన్నికల్లో వీరిద్దరిలో ఎవరో ఒకరు జనసేన నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గుడివాడలో కాపులు అధికంగా ఉండటంతో ..ఇటు కొడాలి నాని కూడా టీడీపీపై విమర్శలు చేసినంత ధాటిగా జనసేన మీద విమర్శలు చేయడం లేదు. పైగా గుడివాడలో యువత కూడా ఎక్కువుగా ఉండటంతో కొడాలి నాని అచితుచి వ్యవహిరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అన్ని అనుకునట్లుగా జరిగితే కొడాలి నాని మీద ఆయన అనుచరుడే పోటీ చేసే అవకశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.