Tuesday, April 22, 2025

పార్లమెంటులో ఏపీ ప్రకంపనలు!

- Advertisement -

ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు పార్లమెంటును వేదికగా చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని టిడిపి ఆరోపించింది. అందుకు సంబంధించి కొన్ని రకాల ఆధారాలను కూడా హోం మంత్రి అమిత్ షాకు ఇచ్చింది. అయితే దానికి విరుగుడు అన్నట్టు రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతిని ప్రస్తావించారు. దీంతో ఢిల్లీలో ఏపీ రాజకీయం సెగలు పుట్టిస్తోంది.

దేశంలో ఎక్కడా జరగని మద్యం కుంభకోణం ఏపీలో జరిగిందని టిడిపి సంచలన ఆరోపణలు చేసింది. లోక్సభలో టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగింది పెద్దది అని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 4 వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో విదేశాలకు పంపించారని కూడా ఆరోపించారు శ్రీకృష్ణదేవరాయలు. ఒక దేశానికి రెండు వేల కోట్లు.. మరో దేశానికి మరో రెండు వేల కోట్లు ఫలానా వ్యక్తుల ద్వారా కూడా పంపించారని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని లావు శ్రీకృష్ణదేవరాయలు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఇచ్చారు. ఈ విషయంలో cbi తో పాటు ఈ డి విచారణ చేపట్టాలని కోరారు. దీంతో రాష్ట్రంలో మద్యం కుంభకోణం అనేది ఢిల్లీలో హాట్ టాపిక్ అయింది.

అయితే దీనిపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఈ తరుణంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు అవినీతిని ప్రస్తావించారు. ఆర్థికపరమైన చర్చల్లో భాగంగా చంద్రబాబుకు ఐటీ నోటీసుల కేసు గురించి ప్రస్తావించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మరోసారి విరుచుకుపడ్డారు.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై అవినీతి కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణంలో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చాలని ఆరోపిస్తూ.. వచ్చిన ఫిర్యాదులపై ఐటి నోటీసులు ఇచ్చింది. కేంద్రం స్పందించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కేసులను పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు సుబ్బారెడ్డి. అందుకే మరోసారి చంద్రబాబుపై సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు.

అయితే ఎప్పుడైతే టిడిపి మద్యం కుంభకోణం అనే అంశాన్ని బయటకు తీసిందో.. అప్పుడే చంద్రబాబు అవినీతి కేసులను ప్రస్తావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా టిడిపి కూటమిని ఇరుకనపెట్టే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే ఢిల్లీ వేదికగా తెలుగుదేశం కూటమి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిస్థితి మారింది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!