తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి రాజీనామా చేస్తారా? ఎమ్మెల్యే పదవిని వదులుకుంటారా? టిడిపి హై కమాండ్ తో తాడోపేడో తేల్చుకుంటారా? అధిష్టానం చర్యలతో విసిగి వేసారి పోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత అనేకసార్లు కొలికపూడి అంశం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు తాజాగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఓ టిడిపి నేతను పార్టీ నుంచి బహిష్కరించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 48 గంటల్లో చర్యలకు ఉపక్రమించాలని కూడా పార్టీ హై కమాండ్ కు నిర్దేశించారు. ఎమ్మెల్యే కొలికపూడి పరిస్థితి చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ లో రఘురామకృష్ణంరాజు చర్యలు గుర్తుకొస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో తిరువూరు నుంచి గెలిచారు కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారే శ్రీనివాసరావు. మంచి విద్యాధికుడు కూడా. ఐఏఎస్, ఐపీఎస్ అకాడమీ ని ఏర్పాటు చేసి ఎంతోమందిని బ్యూరోక్రసీ వ్యవస్థలోకి పంపించిన ఘనత ఆయనది. అటువంటి వ్యక్తి గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో అమరావతి పై గట్టిగానే వాయిస్ వినిపించారు. ముఖ్యంగా ఎల్లో మీడియా డిబేట్ లలో పాల్గొనేవారు. అలా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి పట్ల అప్పట్లో విపరీతమైన వ్యతిరేక భావన వ్యక్తం చేసేవారు. అమరావతి రాజధానిపై జరిగిన డిబేట్ లో ఏకంగా ఓ బిజెపి నేత పై చేయి చేసుకున్నారు. ముక్కు సూటిగా ఉంటారు. తాను చెప్పాల్సింది కుండ బద్దలు కొట్టుకుని చెబుతారు.
తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. పేరుకే ఎస్సీ కానీ.. అక్కడ అగ్రవర్ణాల హవా నడుస్తుంటుంది. ఈ క్రమంలో అనూహ్యంగా అక్కడ తెరపైకి వచ్చారు కొలికపూడి. ఓ ఎల్లో మీడియా అధినేతతో పాటు విజయవాడ టిడిపి ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ సూచన మేరకు చంద్రబాబు ఆయనను తిరువూరు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ విజయం సాధించారు కొలికపూడి.
అయితే గెలిచిన నాటి నుంచి తిరువూరులో ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీ నేతలు ఆయనను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. దీంతో పలుమార్లు పంచాయితీలు కూడా నడిచాయి. చంద్రబాబు సముదాయించడం.. తరువాత వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. ఇటీవల పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి హాజరయ్యారు కూడా. అయితే తిరువూరు నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో కూలికపూడి శ్రీనివాసరావు చాలా రకాలుగా స్టడీ చేశారు. అయితే పార్టీలోని అగ్రవర్ణాల నేతలే దీనికి కారణమని తెలుసుకున్నారు. అదే విషయాన్ని హై కమాండ్ కు చెప్పారు. కానీ హై కమాండ్ మాత్రం ఎమ్మెల్యే శ్రీనివాసరావు తీరును తప్పు పట్టింది. అప్పటినుంచి రాజీనామావయోజనలో ఉన్నారు కొలికపూడి శ్రీనివాసరావు.
తాజాగా రమేష్ రెడ్డి అనే టిడిపి నేతను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు కూలికపూడి శ్రీనివాసరావు. అదే విషయాన్ని జిల్లా అధ్యక్షుడికి చెప్పారు. ఎంపీ కి విన్నవించారు. నియోజకవర్గ పరిశీలకుడికి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రాజీనామా ఆస్త్రాన్ని సంధించారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరికలు పంపారు. మరి ఈ ఎపిసోడ్ ఎటు తిరుగుతుందో చూడాలి.