Tuesday, April 22, 2025

రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ నేతల యాక్టివ్!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పోరాడితే ఏముంది అన్నట్టు వారు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి. కూటమి ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వస్తున్నారు. గత కొంతకాలంగా కనిపించిన నాయకులు సైతం నియోజకవర్గాల్లో కనిపిస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

2024 ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. డిజాస్టర్ ఫలితాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన ఆందోళన, నైరాస్యం కనిపించింది. ప్రజలకు ఇంత చేస్తే దారుణంగా ఓడించారని ఆవేదన చెందారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఓటమిని జీర్ణించుకోలేక బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు.

అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి ముందుగా బయటకు వచ్చారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కూటమి దూకుడుగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెడుతోంది. అరెస్టులకు వెంటాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు చాలామంది నేతలు భయపడుతున్నారు. మరోవైపు పార్టీలో నుంచి కీలక నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పార్టీలో ఉన్న నేతలు ధైర్యం పోగుచేసుకొని పోరాట బాట పడుతుండడం నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుభవార్త అని చెప్పాలి.

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఎక్కడికక్కడే వైయస్సార్ కాంగ్రెస్ నేతలు యాక్టివ్ అవుతున్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలిస్తున్నారు. కూటమి నేతలు అడ్డగిస్తే ప్రతిఘటిస్తున్నారు. కడప జిల్లాలో జరిగింది అదే. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం కూటమి పావులు కదపగా.. వైయస్సార్ కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పనిచేసే అక్కడ కూటమి పాచిక పారకుండా చేశారు.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కదిపేందుకు కూటమి గట్టిగానే పావులు కదుపుతోంది. కలెక్టర్కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వినతి పత్రం అందించింది. అక్కడ కార్పొరేటర్ లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. దానిని అడ్డుకోగలిగారు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్ లను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లగలిగారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా పరిషత్తులతో పాటు మున్సిపాలిటీలను అవిశ్వాస తీర్మానాల ద్వారా కైవసం చేసుకోవాలని టిడిపి కూటమి చూస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ఎక్కడికక్కడే నియోజకవర్గాల ఇన్చార్జిలు అలర్ట్ అయ్యారు. తమ పార్టీ వారితో మాట్లాడుతున్నారు. అవసరం అనుకుంటే వారిని బుజ్జగిస్తున్నారు. వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాక్టివ్ అవుతుండడం విశేషం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!