విశాఖ ఉక్కులో ఏం జరుగుతోంది? ప్రైవేటీకరణ ఆగిందా? ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుందా? లేకుంటే కొనసాగిస్తోందా? అసలు విశాఖ ఉక్కు లో ఏం జరుగుతోంది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చగా మారింది. నాలుగు సంవత్సరాల కిందట విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించింది. అనేక సందర్భాల్లో ప్రైవేటీకరించి తీరుతామని స్పష్టంగా చెప్పింది. ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిన దాఖలాలు కూడా లేవు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ నిలిచిపోయినట్టేనని చెప్తోంది.
మరోవైపు స్టీల్ ప్లాంట్ లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవల ఒకే రోజు 1126 మంది కార్మికులు, ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. మరో వంద మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. అయితే ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇంతమంది బయటకు వెళ్తున్న.. వారి స్థానంలో కొత్త వారి నియామకాలు లేవు. దీంతో కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడం ఖాయం. ఇదే సాకుగా చూపి ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని అనుమానాలు ఉన్నాయి.
కొద్దిరోజుల కిందట కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దాదాపు 11వేల కోట్లకు పైగా సాయం చేసింది. అయితే ప్యాకేజీ కంటే స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని కార్మికులు కోరారు. కానీ ప్యాకేజీకి మొగ్గు చూపింది కేంద్రం. అయితే స్టీల్ ప్లాంట్ తన కాళ్లపై తాను నిలబడాలంటే సొంత గనులు ఉండాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి పెరిగితేనే ప్లాంట్ మనుగడ సాగిస్తుంది. ప్లాంట్ కొనసాగాలంటే తప్పకుండా ఉత్పత్తి పెరగాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు.
ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయాలంటే ఇద్దరు ఉద్యోగులు, కార్మికులు అవసరం. కానీ ఒక్కరు కూడా ఇప్పుడు లేని పరిస్థితి ఎదురవుతోంది. ఒకేసారి 1126 మంది స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే దానిని ఏమనాలి. ఇక్కడ సిబ్బంది కొరత ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఉత్పత్తి పెరగకపోగా గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. దానిని కారణంగా చూస్తూ కేంద్రం ప్రైవేటీకరణకు మరింత చర్యలను వేగవంతం చేస్తుంది.
అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికే చాలామంది కార్మికులు, ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు స్వచ్ఛంద పదవి విరమణలు, ఇంకోవైపు కార్మికులు ఇతర ప్లాంట్లకు తరలింపు.. ఇలా గందరగోళ పరిస్థితుల నడుమ విశాఖ స్టీల్ ప్రైవేటుకరణ ఖాయమని ప్రచారం సాగుతోంది. కానీ అటువంటిదేమీ లేదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇది ముమ్మాటికి ఏపీ ప్రజలకు అన్యాయం చేయడం అవుతుందని కార్మికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.