పిఠాపురం వర్మ మాస్టర్ స్కెచ్ వేశారా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఇద్దరు నేతలకు చెప్పాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా తనను నమ్మించి మోసం చేశారని వర్మ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రజల మధ్యకు వెళ్లి తేల్చుకోవాలని భావిస్తున్నారు.
కాకినాడకు ఎంపీగా పవన్ కళ్యాణ్ సన్నిహితుడు తంగేళ్ల శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో వర్మ కు విభేదాలు ఉన్నాయి. దీంతో ముందుగా కాకినాడ ఎంపీకి చెప్పాలని చూస్తున్నారు వర్మ. గతంలో కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు పిఠాపురంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇతర నియోజకవర్గాల వారికి పిఠాపురంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు వర్మ. ఆ ఇంటి స్థలాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తద్వారా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు సవాల్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో తంగేళ్ల శ్రీనివాస్ పై అసంతృప్తి వచ్చేలా పావులు కదుపుతున్నారు.
వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సానుకూలంగా ఉంటూ వచ్చారు వర్మ. కానీ తన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి తన పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి తన శక్తిని ప్రదర్శించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.
పిఠాపురం వర్మకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఆయనది. అటువంటి వర్మను చాలా తక్కువ చేసి మాట్లాడారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఇప్పుడు ఏం మాట్లాడకూడదని వర్మ నిర్ణయించుకున్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్లి పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. పట్టు తర్వాత తన సత్తా చాటాలని చూస్తున్నారు.
2029 ఎన్నికల నాటికి వర్మ రాజకీయంగా మరింత బలోపేతం కావాలని భావిస్తున్నారు. అప్పటికే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుంది. ఫిక్స్డ్ నియోజకవర్గం దొరికితే మంచిదే. లేకుంటే మాత్రం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి. అయితే పిఠాపురం వర్మ ఒక్కసారిగా ప్రజల్లోకి వస్తుండడాన్ని జనసేన అనుమానిస్తోంది.