Tuesday, April 22, 2025

వంగవీటి రాధా సొంత పార్టీ? తెర వెనుక టిడిపి కాపు నేతలు!

- Advertisement -

వంగవీటి రాధా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారా? ఏదో రాజకీయ పార్టీల్లో పని చేయడం కంటే సొంత పార్టీ ఏర్పాటు మేలని భావిస్తున్నారా? కాపులకు ఒక సరైన వేదిక తేవాలని చూస్తున్నారా? దీనికి తెర వెనుక టిడిపి కాపు నేతలు సహకారం అందిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

వంగవీటి ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. వంగవీటి మోహన్ రంగా ఏపీలో సృష్టించిన రికార్డ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లోను ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. కాపులకు ఆరాధ్య దైవంగా మారిపోయారు ఆయన. అందుకే ఆయన పేరు పెట్టి రాజకీయ పార్టీలు ఓట్లు దండుకుంటూ వచ్చాయి. ఆయన ఓ సామాన్య కాంగ్రెస్ ఎమ్మెల్యే. కానీ అణగారిన వర్గాలకు అండగా నిలిచిన క్రమంలో హత్యకు గురయ్యారు. కాపు సామాజిక వర్గానికి ఒక ఆశాజ్యోతి గా నిలుస్తూ వచ్చారు.

అయితే రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ. సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి అతి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అయితే 2009లో రాజకీయంగా తప్పటడుగులు వేశారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తరువాత జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. అక్కడ కూడా ఓటమి ఎదురయింది. 2019లో తాను అడిగిన సీటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరిన పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ పదవి ఆశించారు. అయితే ఇప్పటివరకు 7 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసిన రాధాకృష్ణకు మాత్రం అవకాశం లేకుండా పోయింది.

అయితే వంగవీటి కుటుంబాన్ని వినియోగించుకుని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతున్నాయి. అందుకే తమకంటూ ఒక సొంత పార్టీ ఉండాలని భావిస్తున్నారు రాధాకృష్ణ. ఎవరినో సీటు అడుక్కునే పరిస్థితి ఉండకూడదు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి టిడిపిలో ఉన్న కాపు నేతలే ప్రోత్సాహం అందిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. కానీ టిడిపిలో ఉన్న కాపు నేతలకు ప్రాధాన్యం దక్కడం లేదు. అందుకే ఆ వర్గంలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఏమైనా కాపుల భర్తీ ఉంటే అది జనసేన ద్వారా పూర్తి చేస్తున్నారు. కనీసం టిడిపిలో ఉన్న కాపు నేతలను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ వర్గంలో అసంతృప్తి ఉంది. అందుకే వంగవీటి రాధాకృష్ణతో పార్టీ పెట్టిస్తే తమకు న్యాయం జరుగుతుందని.. తమ సామాజిక వర్గానికి పదవులు లభిస్తాయని ఆశతో ఉన్నారు. అయితే ఇప్పటికే రాజకీయ నిర్ణయాలకు చేతులు కాల్చుకున్న వంగవీటి రాధాకృష్ణ.. నిజంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా? లేదా? అన్నది అనుమానమే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!