Tuesday, April 22, 2025

టార్గెట్ పెద్దిరెడ్డి.. మద్యం స్కాం కేసులు అందుకే!

- Advertisement -

ఏపీలో లిక్కర్ స్కామ్ అంటూ టిడిపి కూటమి హడావిడి చేస్తోంది. నాటి వైయస్సార్ కాంగ్రెస్ పాలకులపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వారిని జైల్లో పెట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు కేంద్ర పెద్దలను ప్రయోగిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాదిరిగానే అరెస్టులు ఉంటాయని లీకులు ఇస్తోంది. ప్రముఖంగా ఇద్దరు ఎంపీల పేర్లు ఇరికించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒకరు.

ఏపీ సీఎం చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ పెద్ద గొయ్యి తవ్వుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడేలా చేస్తున్నారు. ఇందుకు కేంద్ర పెద్దలను ప్రయోగిస్తున్నారు. విజయసాయిరెడ్డి విషయంలో జరిగింది అదే. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా అదే విధంగా పావులు కదుపుతుండడం విశేషం.

విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతారంటే ఎవరైనా నమ్మారా? కానీ విజయసాయిరెడ్డి తనంతట తాను పార్టీ నుంచి బయటకు వెళుతున్నట్లు ప్రకటించారు. అసలు రాజకీయాలే వదిలేస్తానని చెప్పుకున్నారు. ఇలా చెప్పడం వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. అటు తర్వాత విజయసాయిరెడ్డి కామెంట్స్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చేసిన ఆరోపణతో ఇది స్పష్టమైంది.

ఇప్పుడు లిక్కర్ స్కాంలో వినిపిస్తున్న ప్రధానమైన పేరు మిధున్ రెడ్డి. అటు తర్వాత విజయసాయిరెడ్డి. వీరిద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే విజయసాయిరెడ్డి విషయంలో ఏమీ జరగదు. ఎందుకంటే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన కూటమి లైన్ లోనే ఉన్నారు. ఇక్కడ టార్గెట్ అంతా మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతుండడంతో కత్తి కట్టి మరి ఆయనపై ఫోకస్ పెడతారని స్పష్టమవుతోంది.

చంద్రబాబుకు అత్యంత సీనియర్ మోస్ట్ ప్రత్యర్థి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గత ఐదేళ్లుగా ఆయన చర్యలు కూడా అలానే ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి కుటుంబాన్ని విడిచిపెట్టకూడదని చూస్తున్నారు. అందుకే పెద్దిరెడ్డి పై అటవీ భూములతో పాటు పాత కేసులు తిరగతోడుతున్నారు. మిథున్ రెడ్డి పై ఇప్పుడు మద్యం కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యం పై దెబ్బ తీయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే తాడోపేడో అన్నట్టు పెద్దిరెడ్డి కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసులను ఎదుర్కొనేందుకు బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!