ఏపీలో ఫోన్ టాపింగ్ జరుగుతోందా? వైసిపి కీలక నేతలను టార్గెట్ చేసుకున్నారా? వారి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా? అవుననే అంటున్నారు మాజీమంత్రి పేర్ని నాని. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించారు పేర్ని నాని. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు టాపింగ్ జరుగుతున్నాయని ఆరోపించారు. తన ఫోన్ సైతం ట్యాప్ చేశారని చెప్పుకొచ్చారు. గ్రామస్థాయిలో వైయస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారని చెప్పారు. దీంతో ఇది సంచలన అంశంగా మారిపోయింది.
ఫోన్ టాపింగ్ అనేది తీవ్రమైన నేరం. ఫోన్ ట్యాపింగ్ అంటే సదరు వ్యక్తి అనుమతి లేకుండా.. మరొకరి సంభాషణ వినడం. మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడితే.. మూడో వ్యక్తి మీ ఇద్దరి సంభాషణలను రికార్డు చేయడం ట్యాపింగ్ ముఖ్య ఉద్దేశం. ఒకవేళ ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత శాంతిభద్రతల పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాల నిర్వహణ వంటి విషయంలోనే ట్యాపింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాల్లో టాపింగ్ అంశం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలు చూస్తుంటే తప్పకుండా ట్యాపింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆయన నేరుగా చంద్రబాబు సమీప బంధువుపైనే ఆరోపణలు చేశారు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రి సమీపంలో ఓ వ్యక్తి ప్రత్యేక కార్యాలయాన్ని నడుపుతున్నట్లు ఆరోపించారు నాని. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వ్యక్తిగత సమాచారం వారి వద్ద ఉందని.. ప్రతి ఒక్కరి ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని చెబుతున్నారు పేర్ని నాని. దీంతో ఇది సంచలన అంశంగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా టీడీపీ కూటమి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిస్థితి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను టార్గెట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. అరెస్టులతో పాటు కేసుల పర్వం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పేర్ని నాని ట్యాపింగ్ ఆరోపణలు చేయడం సంచలన అంశంగా మారింది.
ఇప్పటికే తెలంగాణలో టాపింగ్ అంశం కలకలం రేపింది. కెసిఆర్ సర్కార్ హయాంలో అప్పటి కాంగ్రెస్ నేతలపై ట్యాపింగుకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విషయంలో రేవంత్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. దీనికి సంబంధించి పోలీస్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. అరెస్టుల పర్వం కూడా నడిచింది. ఏపీలో అధికార మార్పిడి జరిగితే తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?