Sunday, March 16, 2025

జీవి రెడ్డి రాజీనామా.. రెడ్డి సామాజిక వర్గంలో అంతర్మధనం!

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్. ఆ పార్టీకి చెందిన యువనేత జీవి రెడ్డి రాజీనామా చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి సైతం రిజైన్ ప్రకటించారు. టిడిపి తో పాటు ఆ పార్టీ పదవులను సైతం వదులుకున్నట్లు ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. కానీ టిడిపి కూటమి ప్రభుత్వంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కోవడంతోనే ఆయన నిష్క్రమించినట్లు తెలుస్తోంది. టిడిపి బలహీనంగా ఉండేటప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరారు జీవి రెడ్డి. స్వతహాగా న్యాయవాది అయిన జీవి రెడ్డి మంచి వాగ్దాటి కలిగిన నేత. గత ఐదేళ్లపాటు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన టిడిపిలో చేరారు. కానీ ఇప్పుడు అవమానకర రీతిలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో జీవి రెడ్డి రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్సీలతో పాటు పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండో విడతలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవి రెడ్డికి అవకాశం ఇచ్చారు. నామినేటెడ్ పదవులు అత్యంత కీలకమైనది ఏపీ ఫైబర్ నెట్. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవి కేటాయించడంతో ప్రభుత్వంలోని కీలకమైన ఓ వర్గంలో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం నడిచింది. జీవీ రెడ్డి లాంటి నేతకు పెద్ద పదవి ఇచ్చారని చాలామంది నొచ్చుకున్నట్లు కూడా టాక్ నడిచింది. అయితే జీవి రెడ్డి సమర్థవంతమైన నేతగా చంద్రబాబు వద్ద గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో గత కొద్ది రోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ పై జీవి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తించింది. ఏపీ ఫైబర్ నెట్ సంస్థను చంపేయాలని దినేష్ కుమార్ కుట్రలు పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు కలుగ చేసుకున్నారు. ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ జరిగింది.

అయితే చంద్రబాబు జివిరెడ్డిని తప్పు పట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తనకు గాని సంబంధిత మంత్రికి కానీ ఫిర్యాదు చేయాలి కానీ.. ఏకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మంచి పద్ధతి కాదని జీవి రెడ్డికి చంద్రబాబు మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఐఏఎస్ దినేష్ కుమార్ ఎదుట తనను తప్పు పట్టడానికి సహించుకోలేకపోయిన జీవి రెడ్డి పదవితో పాటు పార్టీకి రాజీనామా ప్రకటించారు. చంద్రబాబు కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డానని.. ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు అహోరాత్రులు శ్రమించానని.. అటువంటి తననే తప్పు పట్టడం ఏంటని జీవి రెడ్డి తెగ బాధ పడినట్లు తెలుస్తోంది.

టిడిపి కూటమి ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. జీవి రెడ్డి రాజీనామాతో ఈ ప్రచారం పతాక స్థాయికి చేరుతోంది. రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా వారికి మంత్రి పదవులు దక్కలేదు. నామినేటెడ్ పదవులు సైతం కేటాయించలేదు. ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యులుగా కూడా ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు. ఇచ్చిన ఒక్కదాని ఒక్క ఫైబర్ నెట్ చైర్మన్ పోస్టులో జీవి రెడ్డి అవమానకర నిష్క్రమణ.. ఆ సామాజిక వర్గంలో పెను దుమారానికి కారణమవుతోంది. ఇప్పటికే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం పట్ల వివక్ష కొనసాగుతోంది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిపోయామన్న బాధ రెడ్డి సామాజిక వర్గంలో కనిపిస్తోంది. జీవి రెడ్డి రాజీనామాతో పెద్ద ఎత్తున ఆ సామాజిక వర్గంలో చర్చ నడుస్తోంది. మున్ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!