Wednesday, March 19, 2025

పవన్ సమ్మతిస్తేనే వర్మకు ఎమ్మెల్సీ పదవి!

- Advertisement -

పిఠాపురం వర్మ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? జన సైనికులు సమ్మ తిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటా కింద 2019లో ఎన్నికైన ఐదుగురు సభ్యుల పదవీకాలం మార్చి 31 తో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.

ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తి, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడుల పదవీకాలం ముగియనుంది. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోనున్నారు. అయితే వీరంతా టిడిపికి చెందిన వారే. మరోసారి ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా పిఠాపురం వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు వర్మ. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వర్మ.. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లలో పిఠాపురం ఒకటి అని విశ్లేషించేలా తీర్చిదిద్దారు. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు వర్మ. ఒకానొక దశలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు కోరారు. అయితే అధినేత చంద్రబాబు పిలిపించి సముదాయించడంతో మెత్తబడ్డారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు.

అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిని చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం నడిచింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఎమ్మెల్సీ పదవి నీదేనంటూ ఆఫర్ ఇచ్చినట్టు కూడా టాక్ నడిచింది. అయితే ఈ తొమ్మిది నెలల్లో ఎమ్మెల్సీ పదవుల భర్తీ అయ్యింది కానీ.. వర్మ పేరు ఎక్కడా వినిపించలేదు. తాజాగా ఇది ఎమ్మెల్సీలకు ఎన్నిక జరుగుతుండడంతో వర్మకు ఛాన్స్ దక్కుతుందని అంతా భావిస్తున్నారు.

అయితే పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇటీవల వర్మ లో అసహనం పెరిగింది. పవన్ కళ్యాణ్ విజయం పై కామెంట్స్ చేశారు. దీనిపై జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. అటు పవన్ సైతం ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే పవన్ సమ్మతిస్తేనే వర్మకు ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!