Wednesday, March 19, 2025

తిరుమల కొండలను రాజశేఖర్ రెడ్డి ఆక్రమించారా? మురళీమోహన్ ఆరోపణల్లో నిజం ఎంత?

- Advertisement -

నిజం నిలకడగా చెప్పులేసుకుని బయలుదేరే ముందే.. అబద్ధం ఊరంతా ప్రచారం చేసి తిరిగి వచ్చే కాలం ఇది. నిజాలు ప్రజల్లోకి వెళ్ళవు కానీ.. అబద్ధాలు అవాస్తవాలు ఇట్టే వెళ్లిపోతాయి. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో సైతం చెడు వేగంగా వెళ్ళింది. అంతలా చెడును వ్యాప్తి చేశారు రాజకీయ ప్రత్యర్థులు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి పట్ల విద్వేషాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ, నటుడు మురళీమోహన్. 80 సంవత్సరాల పైబడి వయసున్న ఆయన రాజశేఖర్ రెడ్డి విషయంలో చాలా రకాలుగా ఆరోపణలు చేశారు. ఏడుకొండల ను మూడు కొండలుగా మార్చడానికి ప్రయత్నించారని.. తిరుమల పరిధిని కుదించారని.. అక్కడ చర్చి కట్టే ప్రయత్నం చేశారని.. శాసనసభలో చంద్రబాబు హెచ్చరించారని.. తిరుమల జోలికి వెళ్లవద్దని చెప్పుకొచ్చారని.. ఆ తరువాత రోజునే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని ఆరోపించారు మురళీమోహన్. అయితే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పై అవి ఆరోపణలు చేసిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, టిడిపి మద్దతుదారులు ఇప్పటికీ అదే ప్రచారం చేస్తుండడం విశేషం.

ఒక అబద్ధాన్ని నిజమని ప్రజలను నమ్మించడం టిడిపి నేతలకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఒక బాధ్యతాయుతమైన మనిషి, ఆపై పార్లమెంట్ మాజీ సభ్యుడు, సినీ సెలెబ్రెటీ అయిన మురళీమోహన్ సైతం అవే అబద్ధాలు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆయన రాజకీయాలను విడిచి పెట్టానని చెబుతున్న.. ఫక్తు టిడిపి నేతగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రాపకం కోసం ఇప్పటికీ వైయస్ రాజశేఖర్ రెడ్డి పై అబాండాలు వేస్తున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మురళీమోహన్ తీరుపై వైయస్సార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2005లో టిడిపికి చెందిన జై చంద్ర నాయుడు తిరుమల కొండపై కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించారు. అప్పుడు పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా జెసి దివాకర్ రెడ్డి ఉన్నారు. పరమ పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు జరగకూడదని భావించి.. తిరుమల పరిధిలో 27.5 కిలోమీటర్ల లో ఎటువంటి రాజకీయ ప్రస్తావన ఉండకూడదని భావించి.. తిరుమల పరిధిని నిర్ణయిస్తూ ఒక జీవో జారీ చేశారు. అది మొదలు రాజశేఖర్ రెడ్డి పై ఒక రకమైన విషం నింపింది ఎల్లో మీడియా. తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో రాజశేఖర్ రెడ్డి పై ఒక రకమైన విష ప్రచారం ప్రారంభించారు కూడా. తిరుమల పరిధిని కుదించారని.. ఏడుకొండల్లో మూడు కొండలను మాత్రమే చూపించారని.. మిగతా నాలుగు కొండల్లో దోపిడీకి తెర లేపారని.. అక్కడ చర్చి కట్టబోతున్నారని ప్రచారం చేయడం ప్రారంభించారు. అలా రాజశేఖర్ రెడ్డి పై బురదజల్లేరు. ఆయన మరణాన్ని సైతం తిరుమలతో లింక్ చేసి ప్రచారం చేశారు.

వాస్తవానికి 1965, 1975లో అప్పటి ప్రభుత్వాలు తిరుమల పరిధిని 27.5 చదరపు కిలోమీటర్లగా చూపించారు. ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేశారు. 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన క్రమంలో తిరుమలలో అర్చకుల వారసత్వం పై వివాదం ఏర్పడింది. ఆ సమయంలో చల్లా కొండయ్య నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో కూడా తిరుమల పరిధిని 27.5 కిలోమీటర్లు చూపించింది కొండయ్య కమిటీ. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని సూచించింది. కానీ ఈ సూచనను బుట్ట దాఖలు చేసింది ఎన్టీఆర్ ప్రభుత్వం. ఇలా 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం సైతం ఇక్కడ రాజకీయాలు మాట వినబడకూడదు అని తిరుమల పరిధిని ప్రకటించింది. గత ప్రభుత్వాలు సూచించిన మాదిరిగానే తిరుమల పరిధిని 27.5 చదరపు కిలోమీటర్ల గా ప్రకటించింది. కానీ టిడిపి తో పాటు ఎల్లో మీడియా మాత్రం అదే పనిగా విషప్రచారం చేసింది.

తాజాగా నటుడు మురళీమోహన్ దీనిపై వ్యాఖ్యానించడం విమర్శలకు తావిస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన.. ఇప్పుడు అదే పనిగా ఆయనపై విషప్రచారం చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో తిరుమల పరిధిని చాలా ప్రభుత్వాలు ప్రకటించాయని.. స్థానిక సంస్థల నిర్వహణపై వచ్చిన పిటీషన్ తోనే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తిరుమల పరిధిని ప్రకటించింది. అందులో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవు. కుదింపులు కూడా లేవు. అయినా సరే అదే ప్రచారం కొనసాగుతుండడం మాత్రం విచారకరం. అయితే మురళీమోహన్ లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు తెలిసి తెలియకుండా ప్రకటనలు చేయడం మాత్రం ముమ్మాటికి స్వార్థమే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!