వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని భావిస్తున్నట్టు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. 11 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. స్పీకర్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే సభలో రాజకీయ దురుద్దేశంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తారని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అదే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ముఖ్యమంత్రి తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రతిపక్ష హోదా లేకుండా సభలోకి వెళ్తే.. బలమైన అధికారపక్షం నుంచి ఏ స్థాయిలో ఎదురుదాడి ఎదురవుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే ఆయన ప్రతిపక్ష నేత హోదా కోసం డిమాండ్ చేస్తూ వచ్చారు.
కేవలం సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన తరువాత టిడిపి కూటమికి సానుకూల వాతావరణం ఏర్పడింది. ప్రజలు యూటర్న్ తీసుకోవడానికి అదే కారణం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై విషప్రచారం చేయడంలో టిడిపి కూటమి సక్సెస్ అయ్యింది. దానికి తోడు రెట్టింపు సంక్షేమం అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు తప్పకుండా అమలు చేస్తారని ప్రజలు భావించారు. కూటమిలో మరో రాజకీయ పక్షం జనసేన సైతం చాలా యాక్టివ్ అయింది. పవన్ కళ్యాణ్ సైతం సంక్షేమ పథకాల ప్రకటనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటంటే ఒకటి కూడా అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయింది. దీనిని గుర్తించిన వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వాన్ని బయట ఎండగట్టడంతో పాటు శాసనసభలో సైతం నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. గత పది రోజులుగా జరిగిన పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఒక రకమైన ఆలోచన తీసుకురాగలిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని గుర్తు చేసింది. గత 9 నెలలు పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది కొంత సక్సెస్ ఇవ్వడంతో పాటు ప్రజల్లో చిన్నపాటి మార్పు ప్రారంభమైంది. దానిని పతాక స్థాయికి తీసుకు వెళ్లాలంటే శాసనసభకు హాజరుకావడమే ఉత్తమమని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులకు ఆ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలి సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ఆదేశించారు.
మరోవైపు శాసనసభ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. కీలక నేతలతో వరుసగా భేటీలు నిర్వహించి వారి అభిప్రాయాలను సైతం తీసుకున్నారు. బడ్జెట్ వార్షిక సమావేశాలు కావడంతో హాజరైతే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అందుకే అసెంబ్లీకి వెళ్లాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధికార పక్షం ఎలాగూ దాడి చేస్తుంది. ఆ దాడిని తట్టుకొని నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నినట్లు సమాచారం. ఒకవేళ అధికార పక్షం నుంచి సరైన సమాధానాలు రాకపోయినా, ఎదురు దాడికి దిగిన.. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం తోక ముడిచిందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. శాసనసభ సమావేశాలు రెండు వారాలు పాటు జరగనున్నాయి. జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పై గవర్నర్ ప్రసంగం వింటారు. అటు తరువాత కేటాయింపులపై మాట్లాడతారు. అదే సమయంలో పరిస్థితి బాగుంటే మొత్తం సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. లేకుంటే కనీసం వైసిపి ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.