ఆ నియోజకవర్గంలో జనసేనకు ఏకపక్షం. మెజారిటీ ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి జై కొడతారు. అందుకే గత రెండుసార్లుగా అక్కడ జనసేన ఎమ్మెల్యేను గెలిపించారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకం.. ఎమ్మెల్యే కు అనుకూలం అన్న వర్గాలు తయారయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారం చేసుకుంటున్నాయి. అయినా సరే జనసేన నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా కథ? అంటే వాచ్ దిస్ స్టోరీ.
డాక్టర్ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో రాజోలు నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీని ఆదరించింది ఈ నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభ్యర్థులు ఓడిపోయారు. చివరికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. అటువంటి సమయంలో రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు. అటు తరువాత ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో అమలాపురం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి దేవ వరప్రసాద్ బరిలో నిలిచారు. ఎన్నికలకు నెల రోజుల ముందు బరిలోకి వచ్చిన ఆయన భారీ గెలుపు సొంతం చేసుకున్నారు. కానీ గెలిచిన నాలుగు నెలలకే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ శ్రేణులే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తీరును ఒకరిద్దరు కీలక నేతలు విభేదిస్తున్నారు. దీంతో అక్కడ జనసేన అడ్డగోలుగా చీలిపోయింది. ఎమ్మెల్యే క్యాడర్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని అసంతృప్త నాయకుల వాదన. అయితే ఎమ్మెల్యే తీరుపై హై కమాండ్ కు చాలాసార్లు నేతలు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోవడం లేదు. దీంతో హై కమాండ్ తీరుపై సైతం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్ మీడియాలో నేరుగా ఎమ్మెల్యే తీరుపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన ను దారుణంగా దెబ్బతీసే పనిలో ఉన్నారని ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా.. అంబేద్కర్ కోనసీమ జనసేన నాయకత్వం కానీ.. ఆ పార్టీ హై కమాండ్ కానీ పట్టించుకోకపోవడం విశేషం.
మరోవైపు రాజోలులోనే జనసేన లోని ఒక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉపయోగ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. కూటమి తరపున టిడిపి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో టిడిపి అభ్యర్థికి ఓటు వేయకూడదని జనసేనలోని ఓవర్గం తీర్మానించుకున్నట్లు సమాచారం. జనసేన నాయకత్వం పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో సైతం ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.