‘అర్జెంటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనం కావాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించాలి. అసలు ఏపీ సమాజంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి. లేకుంటే మాత్రం చాలా కష్టం. 2029 లో ఇలానే అయితే గెలవలేం. ఇది ముమ్మాటికి గ్యారెంటీ’.. ఈ కామెంట్స్ ఎవరు చేస్తున్నారో తెలుసా? ఎందుకు చేస్తున్నారో తెలుసా? టిడిపి కూటమి ఎమ్మెల్యేలు అంతర్గత సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి.. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుండడంతో వారిలో అసహనం వ్యక్తం అవుతోంది. అటు ప్రజలకు మంచి చేయలేక.. ఇటు ప్రత్యర్థిని నిలువరించలేక ఏంటి పరిస్థితి అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. 2029 ఎన్నికలు తలుచుకొని అప్పుడే తలలు పట్టుకుంటున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ప్రజలకి ఇచ్చిన హామీల్లో బలమైన హామీని ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. అమ్మ ఒడి జాడలేదు.. రైతు భరోసా ఊసు లేదు.. నిరుద్యోగ భృతి కనిపించడం లేదు.. కొత్త ఉద్యోగాలు తీయడం లేదు.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేని స్థితిలో కూటమి సర్కార్ మిగిలిపోయింది. ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైంది. ఇది క్రమేపీ పెరుగుతోంది. దీనికి దిద్దుబాటు చర్యలకు దిగిన ఉపయోగం ఉండదని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏపీ ప్రజలు కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలహీనుడు కూడా. కూటమికి 164 సీట్లతో బలమైన స్థానంలో నిలబెట్టారు ఏపీ ప్రజలు. కానీ గత తొమ్మిది నెలలుగా కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతల అరెస్టులు, కేసుల నమోదు, దాడులు వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. 9 నెలల కూటమి పాలనలో ఒక్కో నెల ఒక్కో ఘటనతో డైవర్షన్ పాలిటిక్స్ నడిచింది. అయితే ప్రజలకు అసలు విషయం అర్థమైంది. సంక్షేమ పాలన అందించలేరని స్పష్టమైంది. అందుకే వారిలో వ్యతిరేకత పెళ్ళుబికుతోంది.
అయితే కూటమి ప్రభుత్వ పాలనపై టిడిపి ఎన్నారై అధికార ప్రతినిధి ఒకరు సంచలన ట్విట్ చేశారు. అది విపరీతంగా వైరల్ అవుతోంది. లోకేష్ గ్రౌండ్ రియాలిటీ చూడడం లేదని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పాలన సాగడం లేదని.. జవాబుదారీగా ఉండడం లేదని.. మంచి పనులు చేయడం లేదని.. ఇప్పుడు నాయకత్వం చుట్టూ కోటరీ చేరి తప్పు దోవ పట్టిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గపు నేతను.. దుర్మార్గపు రాజకీయంతోనే దెబ్బతీయాలని సూచించారు. అంటే పాలన సజావుగా సాగడం లేదని చెబుతూనే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాల్సిన ఆవశ్యకతను ఓ నేత వివరించడం అనేది చిన్న మాట కాదు. అంటే 2029 ఎన్నికలపై టిడిపి కూటమి ఎమ్మెల్యేలు ఆశలు వదులుకున్నారన్నమాట.