విజయసాయిరెడ్డి రాజీనామాను వైసీపీ క్యాడర్ లైట్ తీసుకుంటుందా? ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడంతో నష్టం లేదని భావిస్తోందా? తిరిగి ఆయన పార్టీకి ప్రయోజనం చేకూర్చాలని అంచనాకు వస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో నెంబర్ 2 గా ఉంటూ పార్టీ ని విజయపథంలో విజయసాయిరెడ్డి. నిత్యం అధినేత కష్టసుఖాల్లో పాలుపంచుకొని.. పార్టీ వ్యూహాల్లో తనకంటూ ఒక ముద్ర చూపించారు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా జగన్ తలలో నాలుకగా పనిచేశారు. అటువంటి వ్యక్తి పార్టీకి గుడ్ బై చెప్పడం నిజంగా లోటే. అయితే అది పార్టీకి కాదని.. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్ ఆదేశాలతో విజయసాయిరెడ్డి పనిచేసేవారు. తన శక్తి యుక్తులను అన్నింటిని వాడేవారు. అంతకుమించి ఆయన స్వతహాగా నాయకుడు కాదన్నది ఒక అభిప్రాయం. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మద్దతు దారుడుగా ప్రస్తానాన్ని ప్రారంభించి.. జగన్ వెంట ఉంటూ ఆయన కష్టసుఖాలను చూసుకున్నారే తప్ప.. వైసీపీ శ్రేణులను ప్రభావితం చేసే స్థాయిలో విజయసాయిరెడ్డి లేరనేది ఒక వాదన.
వైసిపి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటైన రాజకీయ పార్టీ. తండ్రి అకాల మరణంతో చనిపోయిన వారిని పరామర్శించాలన్న జగన్ ఆలోచనను తుంచేసింది కాంగ్రెస్ నాయకత్వం. ఆ సమయంలోనే పార్టీని ఏర్పాటు చేశారు జగన్. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అప్పుడే ఉప ఎన్నికల్లో దేశం తన వైపు చూసేలా భారీ విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి. ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో కడప పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఉన్న లోక్సభలో అడుగు పెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో తనకంటూ నాయకత్వాన్ని బలోపేతం చేసుకున్నారు జగన్. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఓడిపోయిన తరువాతే ఈ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం నాయకులు ఎవరు ఉన్నా.. లేకపోయినా.. ప్రజలు చూసేది అధినాయకత్వాన్ని. చంద్రబాబా? జగన్మోహన్ రెడ్డా? ప్రజలు చూసేది ఆ కోణంలోనే. అంతేతప్ప విజయసాయిరెడ్డి వెళ్ళిపోతే జగన్ పని అయిపోయింది… టిడిపి నేతలు వెళ్లిపోతే చంద్రబాబు పని అయిపోయింది.. అన్న రోజులకు ఎప్పుడో చెల్లు చీటు.
విజయసాయి రెడ్డి లాంటి నేతలు వెళ్లిపోవడం జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు.. కానీ నిజమైన వైసీపీ అభిమాని మాత్రం ఆహ్వానిస్తున్నారు. గత ఐదేళ్లపాటు జగన్ మెరుగైన పాలన అందించారు అన్నది సగటు అభిమాని అభిప్రాయం. మరి ఎందుకు ఓడిపోయారు అంటే మాత్రం కొందరు నేతల తీరు కారణం వల్లే అంటూ సమాధానం ఇస్తున్నారు. కేవలం కోటరీని నమ్మి జగన్ మోసపోయారని ఎక్కువ మంది బాధపడుతుంటారు. అయితే ఆ కోటరిలో ముఖ్యమైన వ్యక్తి మాత్రం విజయసాయిరెడ్డి. అటువంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోతే వైసీపీ శ్రేణుల్లో ఒక వర్గం ఆహ్వానిస్తోంది. వైసీపీలో ఉన్న సీనియర్లు సైతం చాలామంది సంతోషిస్తున్నారు. పార్టీకి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు.
వైసీపీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు చాలామంది ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి తో పాటు పనిచేసిన వారు ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగిన వారు ఉన్నారు. అటువంటివారు జగన్లో రాజశేఖర్ రెడ్డిని చూసుకున్నారు. కానీ జగన్ మాత్రం సీనియర్లను పక్కనపెట్టి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారికి ఛాన్స్ ఇచ్చారు. కక్కలేక మింగలేక సీనియర్లు తెగ బాధపడేవారు. కానీ ఈ ఓటమి జగన్లో మార్పునకు కారణమైంది. కోటరీ పై ఒక అవగాహన వచ్చింది. వారితో జరుగుతున్న నష్టం గుర్తించగలిగారు జగన్. అందులో భాగమే విజయసాయిరెడ్డి రాజీనామా అంటూ కొత్త విశ్లేషణ ప్రారంభం అయింది. జగన్ చుట్టూ కోటరి లేకపోతే.. మరోసారి ఆయన అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నమ్మకం ఏర్పడుతోంది.