బిజెపి ప్లాన్ ఒకలా ఉండదు. ఒకసారి ప్లాన్ చేసిందంటే సాధించేదాకా వదలదు. రాజకీయంగా పట్టు కోసం అవసరం అయితే మిత్రులను సైతం పక్కన పెడుతుంది. శత్రువులను సైతం కలుపుకెళ్తుంది. ఈ విషయం చాలా సందర్భాల్లో సైతం స్పష్టమైంది. మహారాష్ట్రలో దశాబ్దాలుగా తనతో ఉన్న శివసేనను అడ్డగోలుగా చీల్చింది. ఒడిస్సాలో అయితే దశాబ్దాల స్నేహాన్ని మరిచి నవీన్ పట్నాయక్ కు దారుణమైన దెబ్బతీసింది. అశేష భారతావనిని పాలించాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో సాధించిన విజయాలతో మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు దాని ఫోకస్ దక్షిణాది రాష్ట్రాల పై పడింది. అయితే ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా దక్షిణాదిలో పట్టు సాధిస్తామంటే కుదిరే పని కాదు. అందుకే దానికోసం పవన్ కళ్యాణ్ ను ప్రయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ చర్యలు ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. కేంద్ర పెద్దలు పవన్ చర్యలను బలంగా నమ్ముతారు. పవన్ సైతం బిజెపి విషయంలో అంతే నమ్మకంగా ఉంటారు. ఈ ఎన్నికలకు ముందు ఏపీలో టిడిపి తో కలిసేందుకు బిజెపి ముందుకు రాలేదు. ఆ సమయంలో బిజెపి నేతలు కాళ్లు పట్టుకొని అయినా టిడిపి తో పొత్తు కుదుర్చుతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పటివరకు టిడిపి తో కలవడానికి ఇష్టపడని బిజెపి పవన్ ప్రయత్నాలతో వెనక్కి తగ్గింది. పవన్ చెప్పిన మాదిరిగానే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అందుకు తగ్గట్టు మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే పవన్ కోరాలే కానీ బిజెపి చేసేందుకు సిద్ధంగా ఉంది. అటు బిజెపి విషయంలో సైతం పవన్ కళ్యాణ్ అదే ఫేవర్ తో పని చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే మరో పరిస్థితి ఉండేది. అందుకే అక్కడ అన్ని ప్రయోగాలు చేసింది బిజెపి. చివరికి పవన్ కళ్యాణ్ ను ప్రయోగించింది. పవన్ పర్యటించిన ప్రాంతాల్లో బిజెపితో పాటు మిత్రులు విజయం సాధించారు. దీంతో పవన్ కళ్యాణ్ పై బిజెపికి మరింత గురి కుదిరింది. ఆ నమ్మకంతోనే మరో బాధ్యతను పవన్ కళ్యాణ్ పై బిజెపి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.
పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాలను సందర్శిస్తున్నారు. మూడు రోజులపాటు తమిళనాడుతో పాటు కేరళలోని ప్రముఖ దేవాలయాలను ఆయన సందర్శించనున్నారు. అయితే దీని వెనుక బిజెపి వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఈ ఆలయాల సందర్శనకు దిగినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో హిందుత్వవాదంతో ప్రజల్లోకి వెళ్లాలని బిజెపి భావిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ముందుగా ప్రయోగించినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.