Wednesday, March 19, 2025

కూటమికి బిజెపి షాక్.. 2027లో జమిలి?

- Advertisement -

దేశంలో జమిలి ఎన్నికలు ఖాయమా? సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయా? 2027లోనే ఎన్నికలు రానున్నాయా? బిజెపి భారీ వ్యూహంతో ఉందా? శరవేగంగా పావులు కదుపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బిజెపి జండా ఎగురవేసింది. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీలో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ కొట్టింది బిజెపి. ఇదే దూకుడుతో జమిలి కి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ద్వితీయార్థంలో ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే ఏపీలో వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే.

ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మూడు పార్టీలు కూటమి కట్టడం, కేంద్రంలో బిజెపి మద్దతు ఉండడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం వంటి కారణాలతో.. కూటమి విజయం సాధించగలిగింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఇంతవరకు ఒక్క సంక్షేమ పథకం అంటూ ప్రారంభించలేదు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. కానీ రకరకాల కారణాలు చూపుతూ పథకాలు మాత్రం అమలు చేయలేకపోయారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి ప్రారంభం అయింది. అది ముదిరితే కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయం. అయితే ఐదేళ్లపాటు తమకు ఎవరూ ఏమీ చేయలేరు అన్న భీమా చంద్రబాబులో ఉండేది. కనీసం చివరి రెండు సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి మరోసారి అధికారంలోకి వస్తానని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. కానీ కేంద్రంలో బిజెపి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో గెలిచిన ఊపుతో ఉన్న బిజెపి జమిలిలో భాగంగా ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. రకరకాల ఒత్తిడిలు, కేసులు, దాడులకు భయపడి వెళ్తున్న వారే అధికం. ఎలాగైనా ఈ ఐదేళ్లలో వైసీపీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వీర్యం చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఒకవైపు పాలన సాగిస్తూ.. మరోవైపు వైసీపీ టార్గెట్గా గేమ్ ఆడుతారని అంతా భావించారు. అయితే ఇంతవరకు సంక్షేమ పథకాల అమలు లేదు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అభివృద్ధి పనులు పట్టాలెక్కలేదు. ఇంతలోనే జమిలి ఎన్నికలకు బిజెపి రంగం సిద్ధం చేస్తోంది. దీంతో కూటమికి ఏమంత సమయం లేదు. ఏకకాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే కుదిరే పని కాదు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అన్ని దారులు ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. ఆ పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్ళిపోతున్నా.. వారి స్థానంలో తటస్థ నాయకులు వచ్చి చేరుతున్నారు.

2027 ద్వితీయార్థంలో జమిలి ఎన్నికలు జరిగితే.. కూటమికి తప్పకుండా దెబ్బ ఖాయం. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఉన్నది రెండేళ్లు మాత్రమే. 2026 మాత్రమే పూర్తిస్థాయిలో కూటమి సద్వినియోగం చేసుకోగలరు. అయితే ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచుకునే స్థితిలో మాత్రం కూటమి ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం ఓటమికి ఇబ్బందికరమే. ఒకవేళ ఊహాగానాలు నిజమైతే మాత్రం కూటమి అపజయం ముందుగానే ఊహించవచ్చు. అయితే అదే సమయంలో షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు జరిగినా.. ఇప్పటి మాదిరిగానే సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే మాత్రం కూటమికి ప్రజలు తిరస్కరించడం ఖాయం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!