చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి వేరే పనులు అన్నట్టు ఉంది జనసేన పరిస్థితి. మహిళల రక్షణ అంటూ గొంతు చించుకుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం ఆడపిల్లలను ఆట బొమ్మలుగా చూస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడడమే కాదు వారి శ్రమను సైతం దోచుకుంటున్నారు. మొన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల్లో అరెస్టు కాగా.. తాజాగా తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ లైంగిక వేధింపులతో ప్రాచుర్యంలోకి వచ్చారు. మహిళల రక్షణ అంటూ అధినేత గొంతు చించుకుంటూ ఉంటే.. అనుచరులు మాత్రం అతివల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. చిల్లర వ్యాసాలు వేస్తూ సాఫీగా సాగుతున్న సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. కిరణ్ రాయల్ ఇదే మాదిరిగా వ్యవహరిస్తూ ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు.
బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టారు రాయల్ కిరణ్. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో నేతగా ఎదిగారు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడుగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కోటి 20 లక్షల రూపాయలతో పాటు 25 సవర్ల బంగారం తీసుకుని తనను నిలువునా మోసం చేశాడంటూ కిరణ్ రాయల్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తన బతుకును నాశనం చేయడమే కాకుండా తన ఆస్తులను సైతం హరించాడని ఆరోపించారు. తనకు ఆత్మహత్య శరణ్యమని సెల్ఫీ వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి రోజుకో వీడియో వెలుగులోకి వస్తూనే ఉంది. మహిళల రక్షణ పార్టీగా పేరుపొందిన జనసేన నాయకత్వం స్పందించాల్సి వచ్చింది. విచారణ వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు ఆదేశించింది. ఈ తరుణంలో ఈ కిరణ్ రాయల్ ఎవరు? ఆయన కదేంటి? అన్న చర్చ నడుస్తోంది.
అసలు కిరణ్ రాయల్ ది ఈ రాష్ట్రమే కాదని.. తన పేరు వెనుక ఉన్న రాయల్ కూడా ఇంటిపేరు కాదని ప్రచారం నడుస్తోంది. ఆయన తండ్రి బతుకుతెరువు కోసం రాజస్థాన్ నుంచి తిరుపతి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలో పాన్,బేడా అమ్ముకునేవాడని స్థానికంగా ప్రచారం నడుస్తోంది. కిరణ్ రాయల్ జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంది. సుమారు 25 ఏళ్ల కిందట బతుకుతెరువు కోసం గ్రూప్ థియేటర్స్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. చిరంజీవి సినిమాలకు బ్లాక్ లో టిక్కెట్లు విక్రయించేవాడు. ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్ళి కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పట్లో ఆ కిళ్ళి కొట్టు ద్వారా డ్రగ్స్ కూడా విక్రయించేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. తక్కువ వ్యవధిలో ఆర్థికంగా ఎదుగుదలకు అదే కారణం అన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.
తిరుపతిలో బలిజ సామాజిక వర్గం అధికం. అప్పుడే ఓ బలిజ కుటుంబంలోని యువతితో వివాహం కుదిరింది. అప్పటినుంచి కిరణ్ అనే పేరు పక్కన రాయల్ అనే ఇంటి పేరు వచ్చింది. మెగా ఫాన్స్ గా కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. మెగా ఫ్యాన్స్ కు జిల్లా అధ్యక్షుడిగా మారాడు. రాష్ట్ర పదవిలో కొనసాగాడు. ఇంతలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడంతో.. ఆ ప్రకటన తిరుపతి వేదికగా చేయాలని చిరంజీవిని కోరాడు. అది మొదలు ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా ఎదిగాడు. చిరంజీవి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో షాడో గా మారిపోయాడు. అటు తర్వాత జనసేనలో క్రియాశీలకం అయ్యాడు.