Wednesday, March 19, 2025

జనసేన విస్తరణకు చంద్రబాబు బ్రేక్!

- Advertisement -

ఏపీలో జనసేన విస్తరిస్తుందని అంతా భావించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేతలతో నిండిపోతుందని అంచనా వేశారు. చాలామంది వైసీపీ నేతలు చేరుతారని ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ ప్రస్తుతం కనిపించలేదు. ఒకరిద్దరు నేతలు తప్ప ఆ పార్టీ వైపు ఎవరూ వెళ్లడం లేదు. పవన్ కళ్యాణ్ అనుమతించడం లేదా? లేకుంటే కూటమి రూపంలో చంద్రబాబు నియంత్రిస్తున్నారా? ఇప్పుడు ఇదే అంతటా చర్చ. ఎన్నికల ఫలితాలు అనంతరం జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని అంతా అంచనా వేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం లేని వైసిపి నేతలు.. కేసుల భయం ఎదుర్కొంటున్న వారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కలేదని భావించిన వారు.. ఇలా అంతా జనసేనలో చేరతారని భావించారు. కానీ ఎందుకో దానికి బ్రేక్ పడింది.

ప్రకాశం జిల్లా కు చెందిన వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే ఛాన్స్ లేకుండా పోయింది. కూటమి పార్టీలో ఒకటైన జనసేనలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని ఆయన అంచనా వేసుకున్నారు. జనసేనలో చేరిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిగా చేస్తారని ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఆయన జనసేన నేతాని సొంత పార్టీ శ్రేణులే ఒప్పుకోని స్థితికి పరిస్థితి చేరుకుంది. ఒంగోలులో అయితే కనీసం కూటమిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఛాన్స్ లేకుండా పోయింది. ఆయనతో వేదిక పంచుకునేందుకు సైతం ఎవరు ఇష్టపడడం లేదు.

కృష్ణా జిల్లాకు చెందిన సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఎప్పటినుంచో ఆయనకు ఉంది. పైగా జనసేనకు వెళితే ప్రాధాన్యం దక్కుతుందని భావించారు. అదే అంచనా తో జనసేన లో చేరారు. కానీ ఆయనకు సైతం కూటమిలో పెద్ద గుర్తింపు లేదు. కూటమి వేదికలపై కూడా ఆయనకు పిలుపు లేదు. దీంతో అనవసరంగా జనసేనలోకి వచ్చానా అన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. అందుకే జనసేనలో చేరేందుకు ఎవరు ముందుకు రానట్లు ప్రచారం నడుస్తోంది.

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా కేవలం 21 అసెంబ్లీ సీట్లు తీసుకునేందుకు కారణాలు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ మాదిరిగా క్షేత్రస్థాయిలో జనసేనకు బలం లేదని.. ఆ బలం వచ్చిన నాడు తప్పకుండా ఎక్కువ సీట్లు కోరుదామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు 21 సీట్లు గెలిచి శత శాతం విజయాన్ని దక్కించుకున్నారు. పైగా ఇప్పుడు కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కీలక నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆ స్థాయిలో గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఇక్కడే జనసైనికుల్లో ఒక రకమైన అనుమానం ఉంది. చంద్రబాబు వైపు నుంచి కుట్ర జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. జనసేన విస్తరించకుండా బ్రేక్ చేసింది.. కూటమి సమన్వయం పేరుతో అడ్డుకుంటుంది చంద్రబాబేనని ఒక ఆరోపణ ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు. అలాగని ఆ పార్టీ మరింత బలహీనం అయితే.. జనసేన అంత బలం పెంచుకుంటుంది. మిత్రపక్షంగా సింహభాగం ప్రయోజనాలు కోరుకుంటుంది. ఆ భయంతోనే చంద్రబాబు జనసేన విస్తరణను అడ్డుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!