టిడిపి, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా? సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం పవన్ ఎత్తలేదా? టిడిపి తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారా? ఇలా వస్తున్న వార్తల్లో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఫోన్ ఎత్తని వరకు పరిస్థితి వచ్చిందంటే మాత్రం నమ్మశక్యం కాదు. కానీ ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ కంటే.. ఎవరి వ్యూహం వారికి ఉంది అన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కలిసి ఉంటూనే ఎవరికివారు తమ పార్టీని బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి శతశాతం విజయం సాధించింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరిగింది. అయితే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు, లోకేష్ కంటే ఇమేజ్ అమాంతం పెంచుకుంటున్నారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు.. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతున్నారు. అధికారంలో ఉంటూనే వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. నేనే హోం మంత్రిని అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగని ఎక్కడ టిడిపితో విభేదించడం లేదు. విభేదాలకు అవకాశం ఇవ్వడం లేదు. కానీ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను పసిగట్టి ముందుగానే కొన్ని అస్త్రాలను తయారు చేసుకుంటున్నారు.
తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో వేణు వెంటనే స్పందించారు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబుతో కాకుండా తాను ఒంటరిగా తిరుమల వెళ్లారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనకు టీటీడీ బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. చైర్మన్ తో పాటు టిటిడి అధికారులు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. తద్వారా స్వపక్షంలో విపక్షం అన్నట్టు వ్యవహరించారు. శాంతిభద్రతల విఘాతంపై కూడా కఠినంగా వ్యవహరించారు. హోంమంత్రి కఠినంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని హెచ్చరించారు.
అయితే రాజకీయంగాను కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి బయటపడితే ఎలా వ్యవహరించాలి అనే దానిపై ముందే ప్లాన్ వేసుకున్నట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే తాను ప్రభుత్వంలో ఉండి ప్రశ్నించానని గుర్తు చేసుకునేందుకే ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు పవన్. పైగా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని, మంగళగిరిలో గంజి చిరంజీవి లాంటి నేతలను జనసేనలో చేర్చుకోవడం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. అదే సమయంలో చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. 2029 ఎన్నికల నాటికి ఎవరికి వారుగా పోటీ చేసిన.. వేర్వేరుగా పోటీ చేసిన అందుకు కారణాలను ముందే అన్వేషించుకుంటున్నారు. అలాగని విభేదాల జోలికి పోవడం లేదు. ఎక్కడ విభేదాలు బయట పెట్టడం లేదు కానీ.. ఎవరి ప్రయోజనాల కోసం వారు పరితపిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య గ్యాప్ ఉందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. కానీ అది గ్యాప్ కాదు రాజకీయ వ్యూహం అని కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటున్నారు