మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ సైడ్ చేసిందా? లేకుంటే ఆయనే సైడ్ అయ్యారా? ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కనిపించడం లేదు ఎందుకు? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మరోవైపు నెల్లూరు అర్బన్ బాధ్యతలను టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్. మరోవైపు నెల్లూరు జిల్లా బాధ్యతలను చూస్తున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కానీ అనిల్ కుమార్ విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ఆయన సైతం జిల్లా వైపు చూడడం లేదు. ఇతర రాష్ట్రాలకి పరిమితం అవుతున్నారు. కనీసం చిన్నపాటి ప్రకటన కూడా చేయడం లేదు. దీంతో వైసిపి హైకమాండ్ అనిల్ కుమార్ యాదవ్ ను సైడ్ చేసిందన్న టాక్ ప్రారంభం అయింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అనిల్ కుమార్ యాదవ్ చాలా యాక్టివ్గా పని చేశారు. 2014 ఎన్నికల్లో సైతం గెలిచారు. పార్టీలో చాలా దూకుడుగా ఉండేవారు. అసెంబ్లీలో అప్పటి అధికార పక్షం టిడిపికి ఎదురోడ్డి నిలిచేవారు. ఒకానొక దశలో తన దూకుడు తనంతో జగన్మోహన్ రెడ్డిని ఆకట్టుకున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు క్యాబినెట్లోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కీలకమైన నీటిపారుదల శాఖను కూడా అప్పగించారు. అయితే నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనిల్ కుమార్ యాదవ్ వల్ల భారీ డ్యామేజ్ జరిగింది. దానిని గుర్తించడం వల్ల జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ను పక్కన పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.
అనిల్ కుమార్ యాదవ్ దూకుడుతో నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. ఒకానొక దశలో పార్టీకి మూల స్తంభంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తీరుతోనే బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంతకుముందు వేమిరెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్ పై జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం అనిల్ తీరును తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అనిల్ యాదవ్ కు కొమ్ముకాసే వారు. దాని ఫలితంగానే రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసలు విషయాన్నీ గ్రహించారు. కేవలం అనిల్ కుమార్ యాదవ్ తీరు వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని నివేదికలు కూడా తేల్చి చెబుతున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు అర్బన్ బాధ్యతలను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి.. రూరల్ బాధ్యతలను కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది.
అనిల్ కుమార్ యాదవ్ సైతం రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ అవుతారని అంతా భావించారు. కానీ ఆయన తన నోటి దూలను తగ్గించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తూ ఏపీ రాజకీయాల గురించి పట్టించుకోవడం మానేశారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సైతం అనిల్ వైఫల్యాలు తెలిసాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ తనంతట తాను తప్పుకున్నారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి తప్పించారా అన్నది తెలియాల్సి ఉంది