Sunday, March 16, 2025

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధ పడిందా?

- Advertisement -

జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడిందా? తాను చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే ఈ మార్పుల? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమితో జగన్మోహన్ రెడ్డి తీరుపై పార్టీ శ్రేణులు ఆవేదనతో ఉన్నాయి. అధినేత వైఖరితోనే ఈ పరిస్థితి వచ్చిందని బాహటంగానే చెబుతున్నాయి. తమ అధినేత మారాలని కోరుకుంటున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. కానీ ఇప్పుడు వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కీలక నేతల సైతం రాజకీయాలనుంచి వైదొలుగుతున్నారు. వైసిపి అత్యంత క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. దీంతో తప్పిదాలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే పార్టీని సెట్ చేస్తూ అంతర్గత మార్పులు చేస్తూ ప్రజల మధ్యకు రావాలని భావిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలానికి జగన్మోహన్ రెడ్డి కారణమని సొంత పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన వైఖరిని చాలామంది వైసీపీ శ్రేణులు తప్పు పడతారు కూడా. ఈ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి గందరగోళానికి తెర తీశారు. ఏకంగా 80 మంది అభ్యర్థులను మార్చాలంటే ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారో అర్థమవుతోంది. అయితే ఈ చేర్పులు మార్పులతోనే పార్టీకి ఓటమి ఎదురైందన్నది పార్టీలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. అదే విషయాన్ని ఓటమి తర్వాతే చెప్పారు పార్టీ శ్రేణులు. అందుకే ఈ చేర్పులు మార్పులకు చర్చకు నేతలకు పాత నియోజకవర్గాలనే అప్పగించారు. గతం మాదిరిగా ప్రజల మధ్య ఉండకపోతే ప్రజలు గుర్తించే ఛాన్స్ లేదని కూడా అంచనాకు వచ్చారు. అందుకే ప్రజల మధ్యకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు.

జగన్మోహన్ రెడ్డి స్వరంలో సైతం మార్పు వస్తోంది. అది స్పష్టంగా కనిపిస్తోంది. తనను చూసి ఓటేస్తారని జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పుకునేవారు. తాను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను.. ప్రజలకు మంచి చేస్తున్నాను కాబట్టి తనను చూసి ఓటేస్తారని భావించేవారు. కానీ తాను ఒక్కడినే కాదు పార్టీ నేతలు కూడా కీలకమని ఇప్పుడు గుర్తించారు. అందుకే గతంలో వివిధ కారణాలతో పార్టీకి దూరం పెట్టిన వారిని దగ్గర చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు సీనియర్ మోస్ట్ లీడర్లు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది.

పార్టీ అంటే ఆ నలుగురు కాదు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆ నలుగురికి అప్పగించడం తగదు. పార్టీలో టిక్కెట్ల కేటాయింపు అంటే ఆ నలుగురితో తేలే పని కాదు. ఐప్యాక్ టీం పై ఆధారపడతామంటే తగదు. ఆ నలుగురితో పార్టీని నడిపేస్తామంటే కూడా తగదు. వీటన్నింటిపై జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. అందుకే ఆయనలో కదలిక ప్రారంభమైంది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఒక్కో సమస్యను సెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అన్ని విధాల సంసిద్ధం చేస్తున్నారు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఇటువంటి మార్పు కోరుకున్నారు వైసిపి శ్రేణులు. ఇప్పుడు అదే పనిచేసి వారి అభిమానాన్ని పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!